
నేత్రదానంతో ఇద్దరికి కంటిచూపు
ధర్మవరం అర్బన్: తన మరణానంతరం నేత్రదానంతో ఇద్దరికి కంటి చూపును ప్రసాదించారు ధర్మవరంలోని తుంపత్తి కాలనీకి చెందిన షేక్ బాషా (60). ఆదివారం అనారోగ్యంతో ఆయన మృతి చెందారు. విషయం తెలుసుకున్న యువర్స్ ఫౌండేషన్ యువర్స్ ఫౌండేషన్ కోశాధికారి మోహన్, సభ్యుడు కేతా లోకేష్.. మృతుడి కుటుంబీకులను కలసి నేత్రదానం ఆవశ్యకతపై చైతన్య పరిచారు. దీంతో కుటుంబసభ్యులు అంగీకరించడంతో మృతుడి నేత్రాలను జిల్లా అంధత్వ నివారణ సంస్థ, ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ డాక్టర్ కుళ్లాయప్ప, కంటి రెట్రావైల్ సెంటర్ టెక్నీషియన్ రాఘవేంద్ర సేకరించారు. నేత్రదానానికి సహకరించిన మృతుని భార్య షాహిదా, కుమార్తె సదాకినికు యువర్స్ ఫౌండేషన్ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.
పేకాటరాయుళ్ల అరెస్ట్
హిందూపురం: స్థానిక సప్తగిరి లాడ్జీలో పేకాట ఆడుతున్న 24మందిని అరెస్ట్ చేసి, రూ.51,700 నగదు స్వాధీనం చేసుకున్నట్లు సీఐ రాజగోపాల్‌నాయుడు తెలిపారు. అందిన సమాచారం మేరకు శనివారం అర్ధరాత్రి 12.30 గంటల సమయంలో లాడ్జీలో పోలీసులు తనిఖీలు చేపట్టారు. ధర్మవరం, సోమందేపల్లికి చెందిన వారు ముదిరెడ్డిపల్లిలోని లాడ్జీలో రెండు గదులు అద్దెకు తీసుకుని పేకాట ఆడిస్తున్నట్లుగా గుర్తించారు. నగదుతో పాటు 10 ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకుని, జూదరులపై కేసు నమోదు చేశారు.
టీచర్ల జీతాల చెల్లింపులో నిర్లక్ష్యం తగదు
● వైఎస్సార్‌టీఏ
అనంతపురం ఎడ్యుకేషన్: ఇటీవల ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా బదిలీ అయిన వేలాదిమంది టీచర్లకు రెన్నెళ్లవుతున్నా జీతాలు చెల్లింపులో ప్రభుత్వం నిర్లక్ష్యం వహించడం తగదని వైఎస్సార్ టీచర్స్ అసోసియేషన్ (వైఎస్సార్‌టీఏ) నాయకులు వాపోయారు. ఈ మేరకు అసోసియేషన్ అనంతపురం జిల్లా అధ్యక్షుడు ఎస్.నాగిరెడ్డి, ప్రధానకార్యదర్శి జి.శ్రీధర్‌గౌడ్ ఆదివారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఇప్పటి వరకూ కేడర్‌స్ట్రెన్త్ అప్‌డేట్ చేయకుండా అధికారులు తీవ్ర అలసత్వం ప్రదర్శిస్తున్నారన్నారు. ప్రభుత్వం చొరవ తీసుకుని జీతాల మంజూరుకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

నేత్రదానంతో ఇద్దరికి కంటిచూపు