
12వ పీఆర్సీని నియమించాలి
అనంతపురం ఎడ్యుకేషన్: పండ్రెండవ పే రివిజన్ కమిషన్ (పీఆర్‌సీ)ను వెంటనే ఏర్పాటు చేయాలని, అలాగే మధ్యంతర భృతి (ఐఆర్) 30 శాతాన్ని ప్రకటించాలని ప్రభుత్వాన్ని ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (యూటీఎఫ్) రాష్ట్ర సహాధ్యక్షుడు కె.సురేష్‌కుమార్ డిమాండ్ చేశారు. స్థానిక యూటీఎఫ్ కార్యాలయంలో ‘స్టడీ సర్కిల్ వర్క్‌షాపు’ ఆదివారం జరిగింది. ముఖ్య అతిథిగా విచ్చేసిన సురేష్‌కుమార్ మాట్లాడుతూ.. ఉద్యోగ, ఉపాధ్యాయుల ఫ్రెండ్లీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తామంటూ అధికారంలోకి వచ్చిన కూటమి సర్కార్ ఏడాదవుతున్న వారి సమస్యలు పరిష్కరించకుండా అన్యాయం చేస్తోందని మండిపడ్డారు. పీఎఫ్, ఏపీజీఎల్‌ఐ, సరెండర్ లీవ్‌లు, రిటైర్డ్ అయిన వారికి అందాల్సిన రూ. 20 వేల కోట్ల ఆర్థిక బకాయిలను వెంటనే చెల్లించాలన్నారు. కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన మెమో 57 ప్రకారం 2003 డీఎస్సీ వారికి పాత పెన్షన్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. టీచర్లను బోధనేతర పనులకు ఉపయోగించుకోబోమని చెబుతూనే మరోవైపు రకరకాల యాప్‌లు, వివిధ రకాల శిక్షణలు, ఇతర కార్యక్రమాలతో మానసిక క్షోభకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. కార్యక్రమంలో యూటీఎఫ్ జిల్లా అధ్యక్ష, ప్రధానకార్యదర్శులు గోవిందరాజులు, లింగమయ్య, రాష్ట్ర ఆడిట్ కమిటీ సభ్యులు రమణయ్య, నాయకులు రామప్ప, రాఘవేంద్ర, హనుమంతరెడ్డి, ప్రమీల, రవికుమార్, అబ్దుల్ వహాబ్‌ఖాన్, సంజీవకుమార్, శేఖర్, సుబ్బరాయుడు తదితరులు పాల్గొన్నారు.
యూటీఎఫ్ రాష్ట్ర సహాధ్యక్షుడు
సురేష్‌కుమార్