
వేడుకగా గురుపౌర్ణమి
ప్రశాంతి నిలయం: జిల్లా వ్యాప్తంగా గురుపౌర్ణమి వేడుకలు ఘనంగా జరిగాయి. సాయి ఆలయాలకు గురువారం భక్తులు పోటెత్తారు. భక్తిశ్రద్ధలతో స్వామివారిని దర్శించుకున్నారు. అన్న ప్రసాదం స్వీకరించారు. వేడుకలను పురస్కరించుకుని మందిరాల్లో షిరిడీ సాయినాథునికి ప్రత్యేక పూజలు జరిగాయి. విద్యుద్దీప కాంతుల నడుమ ఆలయాలు కొత్త శోభను సంతరించుకున్నాయి.
విశ్వగురు సత్యసాయి..
అచంచలమైన ప్రేమ, భక్తి విశ్వాసాలను పంచిన విశ్వగురువు సత్యసాయి అని కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ అభివర్ణించారు. గురువారం పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో గురుపౌర్ణమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఉదయం సత్యసాయి విద్యార్థుల వేదపఠనంతో వేడుకలు ప్రారంభమయ్యాయి. అనంతరం ప్రశాంతి భజన బృందం ‘గురువందనం’ కార్యక్రమం నిర్వహించారు. సత్యసాయిని కీర్తిస్తూ చక్కటి భక్తిగీతాలతో కచేరీ నిర్వహించారు. సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ సభ్యుడు నాగానంద గురుపౌర్ణమిని ఉద్దేశించి ప్రారంభోపన్యాసం చేశారు. సత్యసాయి గ్లోబల్ కౌన్సిల్ వైస్ చైర్మన్ నిమిష్ పాండ్య ప్రసంగిస్తూ ఆత్మను గురువుకు కృతజ్ఞతతో లొంగిపోయి ఆరాధించడం ప్రతి ఒక్కరూ అలవర్చుకోవాలని, తద్వారా మానవ జీవితంలో మహిమాన్మిత ఘట్టాలను పొందుతారన్నారు. కేంద్ర మంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ మాట్లాడుతూ ప్రేమ అనే భావన అచంచలమైనదని, ప్రకృతిలోని ప్రతి పుష్పం, చల్లటి గాలి కూడా ప్రేమతత్వాన్ని పంచుతాయన్నారు. కేంద్ర మంత్రిని సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ ఆర్.జె.రత్నాకర్ రాజు సన్మానించారు. కార్యక్రమంలో సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ సభ్యులు డాక్టర్ మోహన్, చక్రవర్తి, సత్యసాయి విద్యాసంస్థల విద్యార్థులు, భక్తులు పాల్గొన్నారు.
వంద మంది రైతులకు పనిముట్ల పంపిణీ..
గురుపౌర్ణమి వేడుకలను పురస్కరించుకుని జిల్లాలో ఎంపిక చేసిన వంద మంది రైతులకు సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కేంద్ర మంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ చేతుల మీదుగా ఉచితంగా పనిముట్లను పంపిణీ చేశారు. అనంతరం శాంతిభవన్ అతిథి గృహంలో కేంద్ర మంత్రి పవిత్రమైన రుద్రాక్ష మొక్కలు నాటారు.

వేడుకగా గురుపౌర్ణమి

వేడుకగా గురుపౌర్ణమి