
పేదలకు విద్యను దూరం చేస్తున్న చంద్రబాబు
● మాజీ మంత్రి సాకే శైలజనాథ్
అనంతపురం కార్పొరేషన్: కూటమి ప్రభుత్వంలో పేద పిల్లలకు విద్య దూరమవుతోందని మాజీ మంత్రి, శింగనమల నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త డాక్టర్ సాకే శైలజనాథ్ విమర్శించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సుదీర్ఘకాలంగా సీఎంగా పని చేశానని చెప్పుకునే చంద్రబాబు విద్యావ్యవస్థ అభివృద్ధికి చేసిన మంచి పని అంటూ ఏ ఒక్కటీ లేదని మండిపడ్డారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో అప్పటి సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన పథకాల పేర్లు మార్చి అభూత కల్పన చేస్తున్న సీఎం చంద్రబాబు సిగ్గుతో తలదించుకోవాలన్నారు. పేరెంట్స్ టీచర్ మీటింగ్ జగనన్న తీసుకువచ్చిందేనన్నారు. శ్రీ సత్యసాయిజిల్లా కొత్త చెరువు ప్రభుత్వ హైస్కూల్‌లో తల్లిదండ్రులకు టీచర్స్ మీటింగ్‌లో పిల్లలకు పాఠాలు బోధించిన మీరు రెండు నెలల క్రితం అదే జిల్లాలో ఏడుగుర్రాలపల్లిలో 9వ తరగతి చదువుతున్న ఎస్సీ విద్యార్థినిపై మృగాళ్లు దాడి చేస్తే ఇంత వరకు బాధితురాలి గురించి పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. అక్కడ బాధింపబడిన కుటుంబం మీ పార్టీకి చెందిన వారే అని ఆ కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసిన కిరాతకులు మీవారేనన్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. ఓ బాధిత బాలికలకు భరోసా కల్పించలేని మీరు రాష్ట్రంలోని పేద విద్యార్థుల భవిష్యత్తుకు ఎలాంటి భరోసా కల్పిస్తారో చెప్పాలన్నారు. కుమారుడు లోకేష్ భవిష్యత్తుపై ఉన్న భరోసా పేద ప్రజలపై సీఎం చంద్రబాబుకు లేదన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య తగ్గడానికి చంద్రబాబు అసమర్థ పాలనే కారణమన్నారు.
పాఠశాల సమస్యలపై
మంత్రికి విద్యార్థుల వినతి
పరిగి: తమ పాఠశాలలో నెలకొన్న వాటర్ ప్లాంట్, ప్రహరీ, క్రీడా మైదానం తదితర సమస్యలను పరిష్కరించాలని మంత్రి సవితకు ధనాపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు విన్నవించారు. శుక్రవారం మంత్రి సవిత పరిగి మండలంలో పర్యటించారు. తొలుత కొడిగెనహళ్లి పంచాయతీ బిందూనగర్‌లో వాటర్ ప్లాంట్ నిర్మాణానికి భూమి పూజ చేశారు. అనంతరం ధనాపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను సందర్శించారు. అక్కడ విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనాన్ని ఆరగించారు. పాఠశాలలో నెలకొన్న సమస్యలపై విద్యార్థులతో ఆరా తీశారు. ప్రహరీతో పాటూ క్రీడా మైదానం చదును తదితర అంశాలను మంత్రి దృష్టికి విద్యార్థులు తీసుకెళ్లారు. అనంతరం పి.నరసాపురంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. కార్యక్రమంలో అధికారులు, కూటమి నాయకులు పాల్గొన్నారు.
యువకుడి ఆత్మహత్య
పుట్టపర్తి టౌన్: అప్పులు తీర్చే మార్గం కానరాక ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన మేరకు.. పుట్టపర్తి మున్సిపాలిటీ పరిధిలోని బీడుపల్లికి చెందిన చాకలి మహేంద్ర (36)కు భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. కూలి పనులతో కుటుంబాన్ని పోషించుకునేవాడు. కిడ్నీ సమస్యతో బాధపడుతున్న తండ్రి వైద్యానికి, కుటుంబ అవసరాలకు అప్పులు చేశాడు. వ్యాధి నయం కాకపోవడంతో కొంత కాలం క్రితం తండ్రి మృతి చెందాడు. తన సంపాదనతో అప్పులు తీర్చడం సాధ్యం కాదని తరచూ మదన పడుతున్న ఆయన శుక్రవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో లుంగీతో ఉరి వేసుకున్నాడు. ఆలస్యంగా విషయాన్ని గమనించిన భార్య వెంటనే బంధువుల సాయంతో సత్యసాయి సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే ఆయన మృతిచెందినట్లు నిర్ధారించారు. సమాచారం అందుకున్న సీఐ సునీత అక్కడకు చేరుకుని పరిశీలించి, కేసు నమోదు చేశారు.
అధికారుల వేధింపులు తాళలేక.. ఆత్మహత్యాయత్నం
గుంతకల్లు/టౌన్: అధికారుల వేధింపులు తాళలేక విద్యుత్ కాంట్రాక్ట్ ఉద్యోగి ఆత్మహత్యాయత్నం చేశారు. బాధితుని బంధువులు, తోటి ఉద్యోగులు తెలిపిన మేరకు... గుంతకల్లులోని బ్యాంక్ కాలనీలో నివాసముంటున్న అన్సూర్ గతంలో గుత్తి ట్రాన్స్‌కో పరిధిలోని ఆర్‌టీఎస్‌ఎస్ (220కె.వి)లో కాంట్రాక్ట్ హెల్పర్‌గా పనిచేసేవాడు. పరస్పర బదిలీల్లో భాగంగా గుంతకల్లులోని ఆలూరు రోడ్డులో ఉన్న 132కేవీ సబ్‌స్టేషన్‌కు వచ్చారు. ఇక్కడ పనిచేస్తున్న రమేష్‌ను గుత్తికి బదిలీ చేశారు. అయితే ఈ బదిలీల్లో తనకు అన్యాయం జరిగిందని ఓ సహోద్యోగి ఎస్సీ కమిషన్‌ను ఆశ్రయించాడు. దీంతో సంబంధిత ట్రాన్స్‌కో అధికారులు అన్సూర్‌ను తిరిగి గుత్తికి వెళ్లిపోవాలని తీవ్రంగా ఒత్తిడి చేయడంతో మనస్తాపం చెందిన ఆయన శుక్రవారం విధుల్లో ఉన్న సమయంలోనే పురుగుల మందు తాగాడు. గమనించిన తోటి ఉద్యోగులు వెంటనే 108 వాహనంలో స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం అనంతపురానికి వైద్యులు రెఫర్ చేశారు. తాము ఆస్పత్రికి వెళ్లేలోపు అతడిని రెఫర్ చేశారని, ఆత్మహత్యాయత్నానికి గల పూర్తి కారణాలు తెలియాల్సి ఉందని వన్‌టౌన్ పోలీసులు చెప్పారు. ఈ ఘటనపై సంబంధిత ట్రాన్స్‌కో అధికారిని వివరణ కోరేందుకు ఫోన్ చేయగా ఆయన స్పందించలేదు.

పేదలకు విద్యను దూరం చేస్తున్న చంద్రబాబు

పేదలకు విద్యను దూరం చేస్తున్న చంద్రబాబు