● డీఎంహెచ్‌ఓ డాక్టర్ ఫైరోజాబేగం
పుట్టపర్తి అర్బన్: జనాభా పెరుగుదల అభివృద్ధికి అవరోధమని జిల్లా వైద్యఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ ఫైరోజాబేగం అన్నారు. ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా శుక్రవారం వైద్య, ఆరోగ్య సిబ్బంది ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీని డీసీహెచ్ మధుసూదన్‌తో కలిసి ఆమె ప్రారంభించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. జనాభా పెరుగుదల వల్ల అన్ని రకాలుగా ఇబ్బందులు ఉంటాయన్నారు. జనాభా నియంత్రణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ డీఎంహెచ్‌ఓ డాక్టర్ సునీల్, డెమో బాబాఫకృద్ధీన్, సీహెచ్‌ఓ శివరాం, ఐసీడీఎస్, అంగన్‌వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు.
రోడ్డు ప్రమాద
కారకుడికి జైలు
పెనుకొండ: వాహనాన్ని అజాగ్రత్తగా నడిపి తనతో పాటు మరో ముగ్గురిని క్షతగాత్రులను చేసిన ఓ వ్యక్తికి పెనుకొండ జ్యుడీషియల్ ఫస్ట్‌క్లాస్ మెజిస్ట్రేట్ బొజ్జప్ప 3 నెలల జైలు శిక్ష విధించారు. ఎస్‌ఐ వెంకటేశ్వర్లు తెలిపిన వివరాల మేరకు... అనంతపురం జిల్లా కూడేరు మండలం కమ్మూరు గ్రామానికి చెందిన అమర్నాథరెడ్డి, రఘునాయక్, సుధాకర్, కుళ్లాయప్ప తదితరులు ఓ పని నిమిత్తం 2018 జూన్ 18న క్రూజర్ వాహనంలో పెనుకొండకు బయలుదేరారు. వాహనం అమర్నాథరెడ్డి నడుపుతున్నాడు. వీరి వాహనం ఆర్టీఓ చెక్‌పోస్ట్, రబ్బర్ ఫ్యాక్టరీ మధ్యకు రాగానే టైరు పేలి బోల్తా పడింది. ఈ ఘటనలో వాహనంలోని వ్యక్తులందరూ గాయపడ్డారు. ఈ మేరకు అప్పట్లో కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తులో ప్రమాదానికి అమర్‌నాథ్‌రెడ్డి కారకుడిగా నిర్ధారించి కోర్టులో చార్జ్‌షీట్ దాఖలు చేశారు. ఈ కేసును విచారించిన పెనుకొండ జ్యుడీషియల్ ఫస్ట్‌క్లాస్ మెజిస్ట్రేట్ బొజ్జప్ప నేరం రుజువు కావడంతో ముద్దాయి అమర్‌నాథ్‌రెడ్డికి 3 నెలల జైలు, రూ.1,500 జరిమానా విధిస్తూ శుక్రవారం తీర్పు చెప్పారని ఎస్‌ఐ వెంకటేశ్వర్లు వెల్లడించారు.
డెంగీతో బాలింత మృతి
గార్లదిన్నె: డెంగీ జ్వరంతో ఓ బాలింత మృత్యువాతపడింది. ఈ ఘటనతో కల్లూరులో విషాదం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన మేరకు వివరాలిలా ఉన్నాయి. బుక్కరాయసముద్రం మండలం పి.కొత్తపల్లికి చెందిన షేక్ చాందిని (22)కి ఏడాదిన్నర క్రితం గార్లదిన్నె మండలం కల్లూరుకు చెందిన షేక్ సాదిక్ అనే కూలీతో వివాహమైంది. రెండు నెలల క్రితం చాందిని పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ క్రమంలో ఈ నెల ఆరో తేదీన చాందినికి జ్వరం రావడంతో కుటుంబ సభ్యులు పామిడి ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ వైద్యులు పరీక్షించి డెంగీ జ్వరం అని తేల్చారు. దీంతో మెరుగైన వైద్యం కోసం అనంతపురంలోని సవీర ఆస్పత్రిలో చేర్చారు. అక్కడ చికిత్స చేయించినా జ్వరం తగ్గకపోవడంతో చాందిని శుక్రవారం మృతి చెందింది. భార్య మరణాన్ని భర్త జీర్ణించుకోలేకపోయాడు. పసికందును ఎత్తుకుని.. తల్లిలేని లోటు ఎవరు తీరుస్తారంటూ కన్నీరుమున్నీరయ్యాడు.
జనాభా పెరుగుదల అభివృద్ధికి అవరోధం
జనాభా పెరుగుదల అభివృద్ధికి అవరోధం