
16న రామగిరి ఎంపీపీ ఎన్నిక
రామగిరి: టీడీపీ అరాచకంతో రెండుసార్లు వాయిదా పడిన రామగిరి మండల పరిషత్ అధ్యక్ష పదవికి ప్రభుత్వం ముచ్చటగా మూడోసారి నోటిఫికేషన్ ఇచ్చింది. ఈనెల 16వ తేదీ ఎన్నిక ఉంటుందని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మెజార్టీ లేకపోయినా ఎలాగైనా రామగిరి ఎంపీపీ పీఠం దక్కించుకునేందుకు టీడీపీ కుయుక్తులు, కుట్రలు, అల్లర్లకు పాల్పడగా... ఇప్పటికే రెండు సార్లు ఎన్నిక వాయిదా పడింది. తాజాగా అధికారులు మరోసారి నోటిఫికేషన్ ఇవ్వగా..ఈసారైనా ఎన్నిక సజావుగా జరిగేనా అంటూ మండల ప్రజలు చర్చించుకుంటున్నారు.
10 స్థానాల్లో 9 మంది
వైఎస్సార్‌సీపీ అభ్యర్థులే..
రామగిరి మండలంలో 10 ఎంపీటీసీ స్థానాలుండగా... గత స్థానిక సంస్థల ఎన్నికల్లో పేరూరు– 1, పేరూరు– 2, పెద్దకొండాపురం, ఎంసీ పల్లి, పోలేపల్లి, కుంటిమద్ది, గంతిమర్రి, మాదాపురం, రామగిరి ...ఇలా 9 స్థానాల్లో వైఎస్సార్ సీపీ అభ్యర్థులే విజయ కేతనం ఎగురవేశారు. కేవలం నసనకోట స్థానాన్ని మాత్రం టీడీపీ దక్కించుకోగలిగింది. రామగిరి ఎంపీపీ స్థానాన్ని ప్రభుత్వం అన్‌రిజర్వడ్ మహిళకు కేటాయించడంతో రామగిరి స్థానం నుంచి గెలిచిన మీనుగ నాగమ్మను వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్ ఎంపీపీ పీఠంపై కూర్చోబెట్టారు. అయితే ఆమె అనారోగ్యంతో 2024 డిసెంబర్ 30న మృతి చెందగా...రామగిరి ఎంపీపీ ఎన్నిక అనివార్యమైంది.
కుట్రలు.. అల్లర్లతో వాయిదాల పర్వం..
ఎంపీపీ మీనుగ నాగమ్మ మృతి నేపథ్యంలో 2025 మార్చి 27న ఎంపీపీ ఎన్నిక నిర్వహించేందుకు అధికారులు నోటిఫికేషన్ ఇచ్చారు. దీంతో ప్రస్తుతం అధికారంలోకి ఉన్న టీడీపీ నాయకురాలు ఎలాగైనా తన సొంత మండలం రామగిరి పీఠం దక్కించుకోవాలని తీవ్రంగా ప్రయత్నించారు. కేవలం ఒక్క ఎంపీటీసీ స్థానంతోనే పీఠంపై జెండా ఎగురవేయాలని కుట్ర చేశారు. ఈ క్రమంలోనే వైఎస్సార్ సీపీ గుర్తుపై గెలిచిన పేరూరు–1, మాదాపురం ఎంపీటీసీ సభ్యులకు టీడీపీ కండువాలు కప్పి తమవైపునకు తిప్పుకున్నారు. అంతేకాకుండా మిగతా వారినీ భయపెట్టి ఎలాగైనా ఎంపీపీ స్థానం దక్కించుకోవాలని భావించారు. ఈ క్రమంలోనే వైఎస్సార్ సీపీ తమ అభ్యర్థులకు రక్షణ కల్పించేందుకు మరో ప్రాంతానికి తరలించింది. సరిగ్గా ఎన్నిక రోజున వారందరినీ రామగిరికి తరలిస్తుండగా.. మార్గమధ్యంలో పేరూరు–2 ఎంపీటీసీ సభ్యురాలిని టీడీపీ నాయకులు బలవంతంగా తీసుకువెళ్లారు. దీంతో ఘర్షణ వాతావరణం చేటుచేసుకోగా, ఎన్నిక సమయానికి ఎంపీటీసీ సభ్యులు రామగిరి చేరుకోలేక పోయారు. దీంతో కోరం లేక ఎన్నికను వాయిదా వేశారు. అనంతరం మే 19న మరోసారి రామగిరి ఎంపీపీ ఎన్నికకు నోటిఫికేషన్ ఇచ్చినా ...టీడీపీ నేతల బెదిరింపులతో ఎన్నికను బహిష్కరిస్తున్నట్లు ఎంపీటీసీలు ప్రకటించారు. దీంతో ప్రభుత్వం తాజాగా మరోసారి నోటిఫికేషన్ ఇచ్చింది.
ఒక్క అభ్యర్థితో పీఠం కోసం టీడీపీ పాకులాట
రామగిరి ఎంపీపీ మహిళకు రిజర్వ్ అయ్యింది. టీడీపీ తరఫున గెలిచింది ఒకే ఒక ఎంపీటీసీ...పైగా మహిళ కాదు. అయినప్పటికీ స్థానిక టీడీపీ నాయకులు రామగిరి ఎంపీపీ స్థానాన్ని దక్కించుకునేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఈనెల 16న జరిగే ఎన్నికలో ఎలాగైనా విజయం సాధించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. అయితే ప్రస్తుతం టీడీపీ వైపు నిలిచిన ముగ్గురు ఎంపీటీసీలూ పురుషులే కాగా, మహిళా స్థానం ఎలా దక్కించుకుంటారోనని ప్రజలు చర్చించుకుంటున్నారు.
ఈసారైనా ప్రక్రియ
సజావుగా జరిగేనా..?
ఇప్పటికే టీడీపీ ఓవరాక్షన్‌తో
రెండుసార్లు వాయిదా
మెజార్టీతో పీఠం దక్కించుకునేందుకు సిద్ధమైన వైఎస్సార్ సీపీ