
తల్లిదండ్రుల స్పందన అంతంతే
కనగానపల్లి/ చిలమత్తూరు: రాష్ట్ర ప్రభుత్వం గురువారం ప్రభుత్వ, ప్రైవేట్ విద్యా సంస్థల్లో చేపట్టిన మెగా పేరెంట్స్, టీచర్స్ మీటింగ్ (మెగా పీటీఎం–2.0)లకు జిల్లాలో స్పందన కరువైంది. వారం రోజులుగా కలెక్టర్ మొదలు విద్యాశాఖ, సమగ్రశిక్ష అధికారులు పూర్తిగా ఈ కార్యక్రమం నిర్వహణపై తీవ్రస్థాయిలో కసరత్తు చేశారు. డీవైఈఓలు, ఎంఈఓలు, హెచ్‌ఎంల మెడపై కత్తిపెట్టి ఒత్తిళ్లు చేశారు. ఇంతచేసినా తల్లిదండ్రుల నుంచి స్పందన అంతంతమాత్రంగానే వచ్చింది. గురుపౌర్ణమి కావడం, మరోవైపు గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువమంది రైతులు, కూలీ చేసుకునే పిల్లలు కావడంతో పనులు మానుకుని వచ్చేందుకు ఆసక్తి చూపలేదు. చాలా ప్రైవేట్, కార్పొరేట్ విద్యా సంస్థల్లోనూ ఫొటోలు తీయించి మమ అనిపించారు.
ఫొటోల అప్‌లోడ్‌పైనే ఆసక్తి..
కొన్ని ప్రభుత్వ స్కూళ్లలో ఫొటోల కోసం తల్లిదండ్రులను బలవంతంగా పిలిపించి వివిధ పోటీలు నిర్వహించారు. విద్యార్థుల అభివృద్ధి, పురోగతిపై చర్చకంటే కూడా కార్యక్రమం నిర్వహించామా...ఫొటోలు, వీడియోలు అప్‌లోడ్ చేశామా పని అయిపోయిందా అనే విధంగా జరిగాయి. ప్రభుత్వ ప్రచారం కోసం తప్ప విద్యార్థులకు ఏమాత్రం ఉపయోగం లేదంటూ తల్లిదండ్రులు నిట్టూర్చారు. ‘నాడు–నేడు’ పనులు చేపట్టక ఎక్కడికక్కడ ఆగిపోయిన తరగతి గదుల గురించి కనీసం పట్టించుకోవడం లేదంటూ మండిపడుతున్నారు. పీటీఎంల నిర్వహణకు ప్రభుత్వం చాలీచాలని నిధులు కేటాయించడంతో అవి సరిపోక తమ జేబు నుంచి పెట్టుకోవాల్సి వచ్చిందని పలువురు హెచ్‌ఎంలు వాపోయారు.
● రాప్తాడు నియోజకవర్గం కనగానపల్లి కేజీబీవీలో సమావేశంలో ఎమ్మెల్యే పరిటాల సునీత ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఇక్కడ 200 మందికి పైగా విద్యార్థినులు ఉన్నారు. అయితే అందులో 50 మంది పేరెంట్స్ కూడా హాజరు కాకపోవడంతో సిబ్బందిపై ఎమ్మెల్యే అసహనం వ్యక్తం చేశారు.
● హిందూపురం నియోజకవర్గ వ్యాప్తంగా ప్రైవేట్ పాఠశాలల్లో పేరెంట్స్ టీచర్స్ సమావేశాలు జరగలేదు. ప్రభుత్వ పాఠశాలలు, గురుకుల పాఠశాలల్లో తూతూమంత్రంగా సాగాయి. చిలమత్తూరు మండలంలోని లక్ష్మీపురంలో గతంలో పాఠశాల నిర్మాణానికి కేటాయించిన స్థలం మరొకరిది అంటూ పంచాయతీ కార్యదర్శి సావిత్రమ్మ తీర్మానం చేయడంపై ప్రజలు పేరెంట్స్ కమిటీ సమావేశంలో తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. వైఎస్సార్‌సీపీ పాలనలో ఆ స్థలంలోనే ఎంపీపీ పురుషోత్తమరెడ్డి విద్యార్థుల కోసం సొంత డబ్బుతో తరగతి గదులు కూడా నిర్మించారన్నారు. ఇప్పుడు ఇతరులు సాగులో ఉన్నారంటూ పాఠశాలకు కేటాయించిన స్థలం స్వాధీనం చేసే ప్రయత్నాలు చేయడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. పాఠశాల స్థలం జోలికి ఎవ్వరూ రాకూడదంటూ ప్రజలు ముక్తకంఠంతో నినదించారు.
మొక్కుబడిగా
మెగా పీటీఎంలు
గ్రామీణ ప్రాంతాల్లో
ఆసక్తి చూపని తల్లిదండ్రులు
ఫొటోలు, వీడియోలు
అప్‌లోడ్ చేసేందుకే ప్రాధాన్యత
చాలీచాలని నిధులతో
హెచ్‌ఎం జేబులకు చిల్లు

తల్లిదండ్రుల స్పందన అంతంతే