
ట్రోలర్లపై కఠిన చర్యలు తీసుకోవాలి
అనంతపురం: ఏపీ హైకోర్టు జడ్జి జస్టిస్ కె.శ్రీనివాసరెడ్డి తీర్పుపై సామాజిక మాధ్యమాల్లో ట్రోలింగ్ చేసిన వారిపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని అనంతపురం బార్ అసోసియేషన్ నాయకులు డిమాండ్ చేశారు. బార్ కౌన్సిల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గురువారం జిల్లా కోర్టు ప్రాంగణంలోని అన్ని కోర్టుల్లో న్యాయవాదులు విధులు బహిష్కరించి, నిరసనలో పాల్గొన్నారు. బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి వెంకట్రాముడు, ట్రెజరర్ వెంకట రఘుకుమార్, సంయుక్త కార్యదర్శి జుబేర్, మాజీ ఉపాధ్యక్షుడు, సీనియర్ న్యాయవాది బడా నారాయణరెడ్డి, శ్రీకాంత్, అవ్వా సురేష్, ప్రణీత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
అమ్మాయి వేధింపులతో మనస్తాపం
● ఆత్మహత్య చేసుకుంటానంటూ ఎస్పీకి అబ్బాయి సెల్ఫీ వీడియో
గుత్తి: మండలంలోని రజాపురం గ్రామానికి చెందిన నారాయణస్వామి అనే యువకుడు ఓ అమ్మాయి వేధింపులు తాళలేక తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు రైలు పట్టాలపై గురువారం ఉదయం సెల్ఫీ వీడియో తీసి ఎస్పీ కార్యాలయానికి పోస్టు చేశాడు. డీపీఓ నుంచి సమాచారం అందుకున్న గుత్తి పోలీసులు సెల్ఫీ వీడియో ఆధారంగా రైలు పట్టాలపై పరుగు తీశారు. గుత్తి–అనంతపురం మార్గ మధ్యంలో విస్తృత తనిఖీలు చేపట్టారు. యువకుడి సెల్‌ఫోన్ పామిడి వద్ద స్విచ్ఛాఫ్ అయినట్లు గుర్తించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకూ గాలించినా యువకుడి ఆచూకీ లభ్యం కాలేదు. గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు.
కేజీబీవీలో కోతుల హల్‌చల్
కూడేరు: స్థానిక కేజీబీవీలో కోతుల బెడదతో విద్యార్థులు బెంబేలెత్తిపోతున్నారు. గదుల్లోకి చొరబడి ట్రంక్ పెట్టెల్లోని దుస్తులు, ఇతర వస్తువులను లాగి పడేస్తున్నాయి. స్టోర్ గదిలోకి వెళ్లి వంట సామగ్రిని చెల్లాచెదురు చేస్తున్నాయి. తరగతి గదుల్లోకి చేరి బాలికలను భయాందోళనకు గురి చేస్తున్నాయి. భోజనం సమయంలో తరిమేందుకు ప్రయత్నిస్తే దాడికి యత్నిస్తున్నాయి. అటవీశాఖ అధికారులు స్పందించి కోతుల బెడద నుంచి కాపాడాలని విద్యార్థుల తల్లిదండ్రులు, సిబ్బంది కోరుతున్నారు.

ట్రోలర్లపై కఠిన చర్యలు తీసుకోవాలి

ట్రోలర్లపై కఠిన చర్యలు తీసుకోవాలి