
కరువు శాశ్వత పరిష్కారానికి చర్యలు
ప్రశాంతి నిలయం: రాయలసీమలో కరువు నివారణకు శాశ్వత పరిష్కారం కనుగొనేందుకు చర్యలు చేపడదామని కేంద్ర వ్యవసాయ, రైతుల సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ పేర్కొన్నారు. గురువారం కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో దక్షిణ ఆంధ్రప్రదేశ్‌లోని కరువు పీడిత జిల్లాల సమీక్షా సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా శివరాజ్‌సింగ్ చౌహాన్ పాల్గొని ప్రసంగించారు. కరువును శాశ్వతంగా పరిష్కరించాలన్నదే కేంద్ర ప్రభుత్వ లక్ష్యం అన్నారు. వ్యవసాయ అనుబంధ రంగాల అధికారులు కలసికట్టుగా ఆలోచించి కరువు నివారణకు చక్కటి పరిష్కారం కనుక్కోవాలన్నారు. కేంద్ర ప్రభుత్వం గ్రామీణాభివృద్ధి, ఎన్‌ఆర్‌ఈజీఎస్, వాటర్‌షెడ్ తదితర పథకాల కింద ఎలాంటి చర్యలు తీసుకోవచ్చనే దానిపై చర్చించి కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలన్నారు. ఇతర శాఖల ద్వారా కూడా కరువు నివారణకు సహకారం అందించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. కలెక్టర్ చేతన్ మాట్లాడుతూ జిల్లాలో వ్యవసాయ అనుబంధ రంగాలు, ఉద్యాన శాఖ పరిధిలో పరిస్థితుల గురించి తెలియజేశారు. రాష్ట్ర వ్యవసాయ శాఖ డైరెక్టర్ ఢిల్లీరావు, రాష్ట్ర హార్టికల్చర్ అండ్ సెరికల్చర్ కమిషనర్ శ్రీనివాసులు మాట్లాడుతూ రాయలసీమ జిల్లాల్లో కరువు పరిస్థితి, వివిధ పంట సాగు వివరాలు, ఇరిగేషన్ అంశాలపై పవర్‌పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా తెలియజేశారు. బుందేల్‌ఖండ్ రీజియన్ మాదిరిగా రాయలసీమ జిల్లాలకు కూడా ఆర్థిక సహాయం ప్రకటించాలని, సీమ అభివృద్ధికి అవసరమైన సహకారం అందించాలని కోరారు. సమావేశంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు, అనంతపురం జాయింట్ కలెక్టర్ శివ్‌నారాయణ శర్మ, శ్రీసత్యసాయి జిల్లా జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్, కర్నూల్ జాయింట్ కలెక్టర్ నవ్య తదితరులు పాల్గొన్నారు.
కేంద్ర మంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్