చిలమత్తూరు: రాష్ట్రంలో కూటమి సర్కారు కొలువుదీరి ఏడాది పూర్తయింది. అయితే ఎన్నికల హామీల అమలును విస్మరించడంతో పాటు మౌలిక సదుపాయాల కల్పనలోనూ విఫలమైంది. అయినా ఏడాది పాలనలో హిందూపురం నియోజకవర్గంలో అభివృద్ధి పరుగులు పెట్టిందంటూ టీడీపీ నేతలు కరపత్రాల ద్వారా ప్రచారం చేసుకోవడం విమర్శలకు తావిస్తోంది. అభివృద్ధి కోసం ఏకంగా రూ.171.2 కోట్లు ఖర్చు చేసినట్టు పేర్కొంటున్నా పనులు ఎక్కడ చేశారు.. ఎంత వెచ్చించారు అన్న వివరాలు పొందుపరచలేదు. ప్రజాప్రతినిధి పీఏలు, టీడీపీ నాయకులు, కాంట్రాక్టర్ల జేబులు నింపుకోవడానికి కొన్ని పనులు చేపట్టి, బిల్లులు చేసుకున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
చేసిన పనులకే బిల్లులు!
హిందూపురం పట్టణంలో సరైన డ్రెయినేజీ వ్యవస్థ లేదు. రోడ్లపైనే మురుగు పారుతున్నా పట్టించుకునే వారు లేరు. పూడికతీత పనుల్లో కాంట్రాక్టర్లు అక్రమాలకు పాల్పడి పనులు చేస్తున్నట్టు జియో ట్యాగ్ చేసి, చేసిన పనులకే బిల్లులు పెట్టించుకునే ఎత్తుగడ వేశారు. ప్రతిపక్ష వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్లు కౌన్సిల్‌లో ప్రశ్నించినా జియో ట్యాగింగ్ చూపి నిధుల మంజూరుకు మార్గం సుగుమం చేసుకున్నారు. ఇలా పట్టణంలో నాసిరకం పనులు చేసి రూ.లక్షలు దండుకుంటున్న వైనాన్ని ప్రజలు గమనిస్తున్నారు.
● పట్టణంలో తాగునీటి కోసం ఇబ్బందులు పడుతున్న కాలనీలు అనేకం ఉన్నాయి. రూ.18.5 కోట్లు ఖర్చు చేసి సీసీ డ్రెయిన్లు, రోడ్లు, వీధి దీపాలు వేశామని ప్రచారం చేసుకుంటున్న నాయకులు.. మరి రోడ్లపైకి మురుగు ఎందుకు వస్తుందో సమాధానం చెప్పలేకపోతున్నారు.
మున్సిపాలిటీలో రోడ్లు అధ్వానం..
ఏడాది పాలనపై ముద్రించిన కరపత్రంలో పేర్కొన్నట్లు హిందూపురం మున్సిపాలిటీలో రోడ్లు లేవు. ఏడాది క్రితం పరిగి బస్టాండ్ వద్ద ఎమ్మెల్యే బాలకృష్ణ భూమిపూజ చేసిన రోడ్డు పనులు ఇప్పటికీ మొదలు కాలేదు. రైల్వే రోడ్డు విస్తరణ ముందుకు సాగలేదు. ఇరుకై న గుంతల రోడ్డులోనే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పట్టణంలో ఇది ప్రధానమైన రోడ్డు కాగా.. ఆక్రమణదారులకు సహకరించే క్రమంలో విస్తరణ పనులు కావాలనే ఆలస్యం చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. కొటిపి రహదారి గుంతలమయంగా మారింది. డీబీ కాలనీలో రోడ్లే లేవు. అక్కడక్కడా గుంతలు పూడ్చి వాటిని రోడ్ల మరమ్మతుల కింద పాలకులు జమకట్టేశారు. వీటి కోసం రూ.12 కోట్లు ఖర్చు చేశామని పేర్కొనడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
● నియోజకవర్గంలోని లేపాక్షి, చిలమత్తూరు మండలాల్లో పొలాలకు దారుల ఏర్పాటు పేరుతో ఉపాధి హామీ నిధులు వెచ్చించారు. అయితే రియల్టర్ల భూములున్న ప్రాంతాలకు రోడ్లు వేయించినట్లు ఆరోపణలు ఉన్నాయి. చిలమత్తూరు మండలంలో రోడ్లు లేని గ్రామాలున్నా వాటిని ఏమాత్రమూ పట్టించుకోలేదు. చిలమత్తూరులో జనవరిలో అంబేడ్కర్ విగ్రహం నుంచి వడ్డి చెన్నంపల్లి వరకు, ప్రభుత్వ ఆస్పత్రి వరకు రహదారి నాసిరకంగా వేసి బిల్లులు చేసుకున్నారు. ఆ రోడ్లు కూడా పెద్ద వర్షం వస్తే కంకర తేలిపోయే పరిస్థితి కనిపిస్తోంది. సంజీవరాయునిపలి రహదారి గుండా రోడ్డు మరమ్మతులు నాసిరకంగా చేసి మమ అనిపించారు. ఎస్.ముద్దిరెడ్డిపల్లి, మదిరేపల్లి వంటి రహదారుల దుస్థితి కూడా అధ్వానంగానే ఉంది.
అభివృద్ధి అంతా బూటకం
ఎమ్మెల్యే బాలకృష్ణ ఏడాది పాలనలో నియోజకవర్గ అభివృద్ధి కోసం రూ.కోట్లు ఖర్చు చేశామని చెప్పుకోవడం సిగ్గుచేటు. ఎన్నికల సమయం తప్ప ఆయన ఏనాడైనా ప్రజల బాగోగులు విన్నారా..? చుట్టం చూపుగా అలా రావడం.. వెళ్లిపోవడం తప్పితే ప్రజలకు చేసిందేమీ లేదు. స్థానికేతరులకు పట్టం కట్టిన ప్రజలపై ఇలా చిన్నచూపు చూడటం సరికాదు. ప్రజల ఆలోచనల్లోనూ మార్పు రావాలి.
– టీఎన్ దీపిక, వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ సమన్వయకర్త, హిందూపురం
మౌలిక సదుపాయాలూ కరువే
ప్రజల సమస్యలు వినేవారెవరు?
అతిథిగా అలా వచ్చి
వెళ్లిపోతున్న ఎమ్మెల్యే బాలకృష్ణ
ఇదీ హిందూపురం
నియోజకవర్గంలోని దుస్థితి
హిందూపురం.. అభివృద్ధి శూన్యం
హిందూపురం.. అభివృద్ధి శూన్యం