
ఆరోగ్య పరిరక్షణపై దృష్టి
ధర్మవరం రూరల్: ప్రజలు జీవనశైలి, ఆహార నియమాలు, శారీరక శ్రమ, వ్యాధులపై అవగాహన కలిగి ఉండటంతో పాటు ఆరోగ్య పరిరక్షణపై దృష్టి సారించాలని డీఎంహెచ్‌ఓ డాక్టర్ ఫైరోజాబేగం సూచించారు. శనివారం ఆమె పోతుకుంట బీసీ కాలనీలో పర్యటించారు. ఇటీవల గుండెపోటుతో మరణించిన వినయ్ కుటుంబాన్ని కలసి, మరణానికి గల కారణాలపై ఆరా తీశారు. అనంతరం ప్రాథమిక పాఠశాలలో కాలనీ ప్రజలతో సమావేశం నిర్వహించారు. బీపీ, షుగర్, గుండె జబ్బులు, ఇతర సాంక్రమిక వ్యాధుల గురించి ప్రజలకు అవగాహన కల్పించారు. ప్రతి ఒక్కరి దినచర్యలో యోగా ఒక భాగం కావాలన్నారు. ముఖ్యంగా యువత జీవనశైలి, ఒత్తిడి మీద విస్తృతంగా అవగాహన కలిగి ఉండాలన్నారు. గుండె జబ్బుల మీద రాష్ట్ర ప్రభుత్వం ‘స్టెమీ’ అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ డీఎంహెచ్‌ఓ డాక్టర్ చెన్నారెడ్డి, మండల వైద్యాధికారులు పుష్పలత, దిలీప్, హెల్త్ సూపర్‌వైజర్ రాజశేఖర్‌రెడ్డి, ఎంఎల్‌హెచ్‌పీ గౌతమి, ఏఎన్‌ఎం శ్యామల, హెల్త్ అసిస్టెంట్ తిరుపాల్ నాయక్, ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
బంగారు దుకాణాలపై మెరుపు దాడులు
హిందూపురం: కర్ణాటక పోలీసులు చోరీలకు సంబంధించి ఆభరణాల రికవరీలో భాగంగా హిందూపురంలోని బంగారు దుకాణాలపై శనివారం రాత్రి మెరుపు దాడులు చేశారు. మెయిన్ బజారులోని పలు షాపుల వద్ద విచారణ చేపట్టారు. ఒకటి, రెండు షాపుల వద్ద కొంత బంగారు సొత్తు రికవరీ చేసినట్లు సమాచారం. దొంగ ఏ షాపు పేరు చెప్తే ఆ షాపు నిర్వాహకుడిని వేధింపులకు గురిచేస్తారని పలువురు దుకాణదారులు భయపడిపోతున్నారు. పోలీసులు మాత్రం దొంగసొత్తులను హిందూపురం, ప్రొద్దుటూరు ప్రాంతాల్లో కొందరు వ్యాపారులు కొంటుంటారని చెబుతున్నారు.
బాలికపై అసభ్య ప్రవర్తన
అనంతపురం: బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తిపై పోలీసులు ‘పోక్సో’ కేసు నమోదు చేశారు. వివరాలు.. అనంతపురానికి చెందిన బాలిక తల్లిదండ్రులు వ్యాపారం నిమిత్తం రోజూ బయటకు వెళ్లేవారు. 9వ తరగతి చదువుతున్న బాలిక శనివారం సాయంత్రం 4 గంటలకు పాఠశాల నుంచి ఇంటికి తిరిగి వెళ్లింది. ఇంట్లో ఉన్న తాతకు కాఫీ చేసి ఇవ్వడానికి స్టవ్ వెలిగించింది. ఈ క్రమంలోనే గ్యాస్ లీకవుతోందని గమనించిన బాలిక... విషయాన్ని తన తాతకు చెప్పింది. వెంటనే ఆయన తమ ఇంటి సమీపంలో కిరాణా కొట్టు నిర్వహిస్తున్న శివారెడ్డి కుమారుడు ఆనంద రెడ్డికి తెలియజేశాడు. ఈ క్రమంలోనే ఇంటి లోపలికి వెళ్లిన ఆనంద రెడ్డి బాలిక పట్ల అనుచితంగా ప్రవర్తించాడు. ఈ విషయం ఎవరికీ చెప్పొద్దంటూ బెదిరించాడు. దీనిపై బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు నాలుగో పట్టణ పోలీసులు ‘పోక్సో’ చట్టం కింద కేసు నమోదు చేశారు. నిందితుడిని అరెస్ట్ చేశారు.

ఆరోగ్య పరిరక్షణపై దృష్టి