మురళీనాయక్ కుటుంబాన్ని పరామర్శించనున్న మాజీ సీఎం
సాక్షి, పుట్టపర్తి: పాకిస్తాన్ ముష్కరుల కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయిన ముడావత్ మురళీనాయక్ కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ఈ నెల 13న గోరంట్ల మండలం కల్లితండాకు రానున్నారు. ఆ రోజు ఉదయం 9.30 గంటలకు బెంగళూరులోని నివాసం నుంచి రోడ్డు మార్గం గుండా బయలుదేరి చిక్కబళ్లాపురం, కొడికొండ చెక్‌పోస్టు, పాలసముద్రం, గుమ్మయ్యగారిపల్లి మీదుగా 11.30 గంటలకు కల్లి తండాకు చేరుకుంటారు. వీరజవాన్ మురళీ నాయక్ తల్లిదండ్రులు జ్యోతిబాయి, శ్రీరామ్ నాయక్‌ను పరామర్శించి, ధైర్యం చెప్పనున్నారు. మధ్యాహ్నం 12.30 గంటలకు తిరిగి బెంగళూరుకు పయనమవుతారు.
లేపాక్షి అభివృద్ధికి రూ.3 కోట్లతో ప్రతిపాదనలు
లేపాక్షి: పర్యాటక ప్రాంతం లేపాక్షిని రూ.3కోట్లతో అభివృద్ధి చేయనున్నట్లు ఆంధ్రప్రదేశ్ టూరిజం అథారిటీ చీఫ్ మార్కెటింగ్ అండ్ కమ్యూనికేషన్ అధికారి పద్మరాణి, ప్రైవేటు కన్సల్టెంట్ అధికారి నిష్టాగోయల్ తెలిపారు. ఈ మేరకు వారు ఆదివారం వారు లేపాక్షిని సందర్శించారు. పర్యాటక అభివృద్ధి కోసం నంది విగ్రహం, థీమ్ పార్కు, జఠాయువు పక్షి, జఠాయువు ఘాట్, బింగిపల్లి వద్ద వున్న చింత తోపు, అక్కడున్న ప్రభుత్వ భూమిని పరిశీలించారు. నిరుపయోగంగా ఉన్న లేపాక్షి ఎంపోరియం భవనాన్ని కూడా పరిశీలించారు. అనంతరం పాతూరులో పట్టు పురుగుల పెంపకం షెడ్డు, చేనేతపై ఆధారపడి జీవనం సాగిస్తున్న వారితో మాట్లాడారు. అనంతరం వారు మాట్లాడుతూ రాష్ట్రీయ గ్రామ స్వరాజ్ అభియాన్ కింద రూ. 3 కోట్ల నిధులతో లేపాక్షిని పర్యాటకంగా అభివృద్ధి చేయడంతో పాటు గ్రామంలో జీవనోపాధులు పెంచడానికి చర్యలు తీసుకుంటామన్నారు.
బింగిపల్లి వద్దనున్న ప్రభుత్వ భూమిలో అందమైన పార్కులు అభివృద్ధి, పట్టు పురుగు పెంపకం ద్వారా ఎలాంటి అభివృద్ధి చేయవచ్చు, నిరుపయోగంగా ఉన్న ఎంపోరియం భవనంలో చేతి వృత్తులు నిర్వహించే వారికి స్టాళ్లు ఏర్పాటు చేసుకోవడానికి తీసుకోవాల్సిన చర్యలపై ఆరా తీశారు. త్వరలోనే ప్రభుత్వానికి నివేదికలు పంపుతామన్నారు. అనంతరం వీరభద్రస్వామి దేవాలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. సర్పంచ్ ఆదినారాయణతో పాటు డీఆర్‌డీఏ పీడీ, టూరిజం శాఖ ఇన్‌చార్జ్ అధికారి నరసయ్య, ఎంపీడీఓ నరసింహమూర్తి, పంచాయతీ కార్యదర్శి సాయిప్రసాద్, విజయ్, మారుతి, మహిళా సంఘం అధ్యక్షురాలు అరుణ వారి వెంట ఉన్నారు.
రేపు కల్లితండాకు వైఎస్ జగన్


