బీసీల పేరుతో బహిరంగ దోపిడీ
పెనుకొండ రూరల్: బీసీల పేరుతో కూటమి ప్రభుత్వం బహిరంగ దోపిడీకి పాల్పడుతోందని వైఎస్సార్‌సీపీ వాల్మీకి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు పొగాకు రామచంద్ర విమర్శించారు. పెనుకొండలోని తన నివాసంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా లక్ష మంది మహిళలకు 50 రోజుల పాటు కుట్టు శిక్షణ కార్యక్రమాన్ని కూటమి ప్రభుత్వం ప్రారంభించిందన్నారు. శిక్షణకు హాజరయై ప్రతి మహిళకూ రూ. 3 వేల స్టయిఫండ్‌తో పాటు శిక్షణ అనంతరం కుట్టుమిషన్‌ను ఉచితంగా అందజేసేలా కార్యాచరణను రూపొందించారన్నారు. ఇందుకోసం ఒక్కో లబ్ధిదారుకు రూ.23 వేలు వెచ్చిస్తున్నట్లుగా ప్రకటిచిందన్నారు. ఇక్కడి వరకూ అంతా బాగానే ఉన్నా... శిక్షణ కాలంలో చెల్లించే రూ.3 వేల స్టయిఫండ్, ఉచితంగా అందజేసే కుట్టు మిషన్ ధర రూ.4,300 పోను... రూ.23 వేలలో మిగిలిన రూ.15, 700 ఏమవుతున్నదో అంతు చిక్కడం లేదన్నారు. శిక్షణ సమయంలో దారం, టేపు, కత్తెర, స్కేల్ వంటి పరికరాలను లబ్ధిదారులే సమకూర్చుకుంటున్నారన్నారు. కొన్ని శిక్షణ కేంద్రాలలో తాగేందుకు మంచినీరు, బాత్‌రూమ్‌లకు కూడా లేవన్నారు. రోజులో ఉదయం 4గంటలు, మధ్యాహ్నం 4 గంటల పాటు శిక్షణ ఇవ్వాల్సి ఉండగా, కేవలం రెండు, మూడు గంటల్లోనే ముగించేస్తున్నారన్నారు. మొత్తం ఈ వ్యవహారంలో రాష్ట్ర వ్యాప్తంగా లక్ష మంది మహిళలకు అయ్యే ఖర్చు రూ.73 కోట్లు కాగా, మిగిలిన రూ.167 కోట్లను దిగమింగేందుకే ఈ పథకాన్ని ప్రభుత్వ పెద్దలు అమలు చేస్తున్నట్లుగా అర్థమవుతోందన్నారు. జాతీయ స్థాయిలో అనుభవం కలిగిన సంస్థలను పక్కన పెట్టి, సొంత సంస్థలకు శిక్షణ కాంట్రాక్ట్‌లను కట్టబెట్టి కూటమి నాయకులు సొమ్ము చేసుకుంటున్నారని విమర్శించారు. బీసీల పేరుతో కుట్టు శిక్షణ వ్యవహారమంతా చూస్తున్న సంబంధిత శాఖ మంత్రి, ప్రభుత్వ పెద్దలు దోచుకునేందుకు సిద్ధమయ్యారని మండిపడ్డారు. పథకాల పేరుతో ప్రజాధనాన్ని దోచుకొనేందుకు సిద్ధమైన ప్రభుత్వ పెద్దల తీరును ఎండగడుతూ వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో పోరాటాలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో వాల్మీకి సాధికారిత కమిటీ సభ్యులు చెన్నేకొత్తపల్లి బొగ్గు కృష్ణా, ఆనంద్, గుట్టూరు పిట్టా బాబు, బి.ఆనంద్, మజ్జిగ నాగరాజు, పరంధామ తదితరులు పాల్గొన్నారు.
వైఎస్సార్‌సీపీ వాల్మీకి విభాగం రాష్ట్ర
అధ్యక్షుడు పొగాకు రామచంద్ర ధ్వజం


