
మృతుడు లాల్‌బాషా
కణేకల్లు: రంజాన్ పండుగ ఓ ముస్లిం కుటుంబంలో తీరని విషాదాన్ని మిగిల్చింది. గ్రామంలోని అందరూ రంజాన్ పండుగ జరుపుకుంటున్న వేళ నమాజ్ కోసం మసీదుకు వెళ్లిన ఓ వ్యక్తిని కరెంటు షాక్ రూపంలో మృత్యువు కబళించింది. ఈ విషాద ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. వివరాలు...
కణేకల్లు మండలం సొల్లాపురం గ్రామానికి చెందిన డి.లాల్‌బాషా (32)కు నాలుగేళ్ల క్రితం అనంతపురానికి చెందిన వన్నూర్‌బీతో వివాహమైంది. వీరికి ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు. టిప్పర్ డ్రైవర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్న లాల్‌బాషా... రంజాన్ మాసం ఆరంభం నుంచి తన విధులకు సెలవు పెట్టి ఉపవాసాలుంటూ ఐదుపూటల నమాజ్‌లో పాల్గొంటూ వచ్చారు. గురువారం పండుగ కావడంతో ఇంట్లో అందరితో కలసి సంతోషంగా గడిపారు. సాయంత్రం ప్రార్థనకు మసీదు వెళ్లిన లాల్‌బాషా వజూ (కాళ్లు, చేతులు శుభ్రం) చేసుకునేందుకు కొళాయి వద్దకెళ్లాడు. అప్పటికే తెగిపడిన విద్యుత్ సర్వీస్ వైరును గమనించకుండా తొక్కడంతో షాక్‌కు గురయ్యాడు. గమనించిన స్నేహితుడు బాషా వెంటనే అతన్ని పక్కకు లాగాడు. ఆ సమయంలో బాషా కూడా షాక్‌కు గురైనా త్రుటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు. కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న లాల్‌బాషాను స్థానికులు వెంటనే ఉరవకొండలోని ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే ఆయన మృతిచెందినట్లు నిర్ధారించారు. విషయం తెలుసుకున్న వెంటనే గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మృతుడి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు.
విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి
మసీదులో ప్రార్థనలకు వెళ్లిన
సమయంలో ఘటన