పెళ్లీడుకొచ్చిన నా కూతురుతో ఎస్‌ఐ హేమంత్‌ అసభ్యంగా ప్రవర్తించాడు

కదిరి రూరల్‌ పోలీస్‌స్టేషన్‌ వద్ద ధర్నాకు దిగిన బాధితులు  - Sakshi

కదిరి: ముదిగుబ్బ ఎస్‌ఐ హేమంత్‌కుమార్‌పై కదిరి మండలం కుమ్మరవాండ్లపల్లికి చెందిన గిరిజన మహిళ బుక్యా రాధమ్మ మంగళవారం రాత్రి రూరల్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. మొదట ఫిర్యాదు తీసుకోవడానికి రూరల్‌ సీఐ సూర్యనారాయణ నిరాకరించడంతో ఆమెతో పాటు కుటుంబ సభ్యులు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి చెందిన కుమ్మరవాండ్లపల్లి సర్పంచ్‌ శాంతమ్మ, ఆమె కుమారుడు మణికంఠనాయక్‌, కుటుంబ సభ్యులు స్టేషన్‌ ప్రాంగణంలో ధర్నాకు దిగారు. చివరకు చేసేది లేక 100కు ఫోన్‌ చేసి తమకు జరిగిన అన్యాయాన్ని తెలిపారు. తర్వాత అక్కడి నుంచి డీఎస్పీ కార్యాలయానికి చేరుకొని డీఎస్పీ శ్రీలతకు తమ గోడును వెళ్లబోసుకున్నారు.

బాధితురాలు రాధమ్మ ఫిర్యాదు మేరకు.. ఎస్‌ఐ హేమంత్‌, కానిస్టేబుళ్లు రామాంజి, హరినాథరెడ్డితో పాటు టీడీపీ నాయకుడు కలాం ఆదివారం రాత్రి 7.30 గంటల ప్రాంతంలో తమ ఇంటికి వచ్చారన్నారు. నీ భర్త గోవింద్‌నాయక్‌ మా దగ్గర ఉన్నాడు.. కావాలంటే ఫోన్‌లో మాట్లాడు అని ఫోన్‌ చేసి ఇచ్చారని తెలిపారు. ‘పోలీసులతో ప్రాణహాని ఉంది. పోలీసులు చెప్పినట్టు చేయండి అని తన భర్త చెప్పడంతో మేం ఏమీ చేయలేని పరిస్థితిలో ఉండిపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్‌ఐ హేమంత్‌ బీరువా తాళాలు ఎక్కడున్నాయని బెదిరించాడన్నారు.

అక్కడే నిల్చున్న పెళ్లీడుకొచ్చిన తన కూతురుతో అసభ్యంగా ప్రవర్తించాడని వాపోయారు. భయంతో ఆయనకు బీరువా తాళాలు ఇచ్చేశామని చెప్పారు. అమ్మాయి పెళ్లి కోసం తెచ్చిన 50 గ్రాముల బంగారంతో పాటు రూ. 5 లక్షల నగదు తీసుకున్నారన్నారు. ఈ విషయం ఎవరికై నా చెబితే గోవిందనాయక్‌ను చంపేస్తామని ఎస్‌ఐ బెదిరించాడని ఆరోపించారు.

అంతలోనే తన తమ్ముడు మణికంఠనాయక్‌తో పాటు చుట్టుపక్కల వారు రావడంతో వారు అక్కడి నుంచి పరారయ్యారని తెలిపారు. తమ కూతురు పట్ల అసభ్యంగా ప్రవర్తించడంతో పాటు కులం పేరుతో దూషించడమే కాకుండా నగదు, నగలు ఎత్తుకెళ్లిన ఎస్‌ఐ హేమంత్‌తో పాటు కానిస్టేబుళ్లు రామాంజి, హరినాథ్‌, టీడీపీ నాయకుడు కలాంపై కఠిన చర్య తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు.

Read latest Sri Sathya Sai News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top