ఈ ధనదాహం తీరనిది..! | - | Sakshi
Sakshi News home page

ఈ ధనదాహం తీరనిది..!

Oct 11 2026 12:27 AM | Updated on Oct 11 2026 12:27 AM

● లక్ష క్యూబిక్‌ మీటర్ల గ్రావెల్‌

తరలింపునకు సర్వేపల్లి ముఖ్యనేత స్కెచ్‌

● అనుమతులివ్వాలంటూ ఇరిగేషన్‌

అధికారులపై ఒత్తిడి

● తిరుగుబాటు చేస్తామని హెచ్చరిస్తున్న

ఇడిమేపల్లి రైతులు

సాక్షి ప్రతినిధి, నెల్లూరు: సర్వేపల్లి ముఖ్యనేత ధనదాహానికి అడ్డూ అదుపులేకుండా పోతోంది. కూటమి ప్రభుత్వం కొలువుదీరిన నాటి నుంచి ఖాళీగా ఉన్న ప్రభుత్వ ల్యాండ్స్‌, పేదలకు పంపిణీ చేసిన భూముల్లో రూ.కోట్ల విలువజేసే గ్రావెల్‌ను రేయింబవళ్లూ అక్రమంగా తరలించి భారీగా సొమ్ము చేసుకున్నారు. ఎల్‌నినో ప్రభావంతో ప్రస్తుతం చుక్కనీరు లేకుండా ఉన్న చెరువుల్లో భారీగా కొల్లగొట్టి దోచుకునేందుకు స్కెచ్చేస్తున్నారు. అనుమతులిచ్చేందుకు అధికారులు వెనుకడుగేస్తుంటే, వారిని దుర్భషలాడుతూ, ఒత్తిడి తీసుకురావడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

పట్టించుకోని అధికారులు

జిల్లాలోని ఏ నియోజకవర్గంలో లేని విధంగా సర్వేపల్లిలో గ్రావెల్‌ అక్రమ రవాణా జోరుగా సాగుతోంది. భారీ యంత్రాలతో నిరంతరం తవ్వి టిప్పర్ల ద్వారా లేఅవుట్లకు తరలిస్తున్నారు. ఈ దందాలో సర్వేపల్లి ముఖ్యనేత ప్రమేయం ఉండటంతో మైనింగ్‌, పోలీస్‌, రెవెన్యూ అధికారులెవరూ కన్నెత్తి చూడటంలేదు. పత్రికలు, టీవీ ఛానళ్లలో కథనాలొచ్చినా.. ఆయా గ్రామాల ప్రజలు తమకు కలిగే నష్టాలపై మొరపెట్టుకున్నా.. పట్టించుకునే నాథుడే కరువయ్యారు. నియోజకవర్గ పరిధిలోని వెంకటాచలం, పొదలకూరు, ముత్తుకూరు, మనుబోలు మండలాల్లో గల పలు గ్రామాల్లో ఇప్పటికే రూ.కోట్ల విలువజేసే గ్రావెల్‌ను కొల్లగొట్టారు.

అసంతృప్తిగా టీడీపీ నేతలు

గ్రావెల్‌ను ఇప్పటికే కొల్లగొట్టి భారీగా వెనుకేసుకున్నా, సర్వేపల్లి ముఖ్యనేతకు ధనదాహం తీరడంలేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. తమ పొలాల్లోకి మట్టిని తరలించుకుంటామని.. దీనికి అనుమతులిప్పించాలని కోరితే ఇష్టమొచ్చినట్లు దుర్భాషలాడుతున్నారని టీడీపీ నేతలే తమ అసంతృప్తిని బహిరంగంగా వెళ్లగక్కుతున్నారు. ఎలాంటి అనుమతుల్లేకుండానే భారీ టిప్పర్లలో లేఅవుట్లకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారని విమర్శిస్తున్నారు.

అనుమతులివ్వాల్సిందే..

వెంకటాచలం మండలం ఇడిమేపల్లి చెరువు చుక్కనీరు లేక ఎండిపోవడంతో అక్కడ లక్ష క్యూబిక్‌ మీటర్ల గ్రావెల్‌ను తరలించేందుకు స్కెచ్చేశారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఇలా వ్యవహరిస్తే రైతులు ఇబ్బందులు పడతారని, చెరువు ఉనికి కోల్పోతుందని ఇరిగేషన్‌ అధికారులు నచ్చజెప్పే యత్నం చేసినా, అనుమతులివ్వాల్సిందేనంటూ వారిని దుర్భాషలాడుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. గ్రావెల్‌ తరలింపునకు ఇనీషియల్‌ కా స్ట్‌ను చెల్లించకుండా, సీనరేజీని చెల్లిస్తామని, పర్మి షన్లు మంజూరు చేయాలంటూ తీవ్ర ఒత్తిడి తెస్తున్నారని సమాచారం. పోరాటానికి దిగైనా చెరువులో గ్రావెల్‌ తరలింపును అడ్డుకుంటామని గ్రామస్తులు హెచ్చరిస్తున్నారు.

అడ్డుకుంటే బెదిరింపులు

వెంకటాచలం మండలంలోని రామదాసుకండ్రిగ, సర్వేపల్లి, నాగంభొట్లకండ్రిగ, శ్రీకాంత్‌ కాలనీ తదితర గ్రామాల్లో గ్రావెల్‌ తరలింపును అడ్డుకునేందుకు ప్రజలు యత్నించారు. అయితే నిర్వాహకులు బెదిరింపులకు గురిచేసి తమ పనిని కానిచ్చారు. పొదలకూరు మండలంలో ప్రజలతో పాటు టీడీపీకి చెందిన వారే వ్యతిరేకించినా తవ్వకాలకు ఏ మాత్రం అడ్డుకట్ట పడటంలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement