సీఐ అవినీతిపై సమగ్ర విచారణ చేపట్టాలి | - | Sakshi
Sakshi News home page

సీఐ అవినీతిపై సమగ్ర విచారణ చేపట్టాలి

Oct 11 2026 12:27 AM | Updated on Oct 11 2026 12:27 AM

● డీజీపీ, అవినీతి నిరోధక శాఖ, విజిలెన్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌,

ఎస్పీకి లేఖల్లో ఫిర్యాదు

● స్థానిక ఎన్నికల వేళ నాన్‌ ఫోకల్‌

పోస్టింగ్‌ ఇవ్వాలి

● మాజీ మంత్రి నల్లపరెడ్డి

ప్రసన్నకుమార్‌రెడ్డి డిమాండ్‌

కోవూరు: బుచ్చిరెడ్డిపాళెం రూరల్‌ సీఐ ఓగిబోయిన దుర్గా ప్రసాద్‌పై వచ్చిన అవినీతి, అక్రమ వసూళ్లు, అధికార దుర్వినియోగం ఆరోపణలపై సమగ్ర విచారణ జరపాలని మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర పీఏసీ సభ్యుడు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. సీఐ దుర్గాప్రసాద్‌పై వచ్చిన ఆరోపణలపై నిష్పక్షపాతంగా దర్యాప్తు చేపట్టాలని కోరుతూ శనివారం డీజీపీ, అవినీతి నిరోధక శాఖ, విజిలెన్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌, జిల్లా ఎస్పీకి లేఖలు రాశారు. అనంతరం నెల్లూరులోని తన నివాసంలో ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ పోలీసుశాఖలో వివిధ హోదాల్లో పనిచేసిన సమయంలో సీఐపై గతంతోపాటు, ప్రస్తుతం విధి నిర్వహణలోని వ్యవహారాలపైనా విచారణ జరిపి శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు.

ఆదాయానికి మించి ఆస్తులు

సీఐ దుర్గా ప్రసాద్‌ పోలీసుశాఖలో చేరకముందు ఉన్న ఆస్తులు, ఉద్యోగంలో చేరిన తర్వాత సంపాదించిన స్థిర, చరాస్తులపై సమగ్రంగా విచారణ చేపట్టాలని ప్రసన్నకుమార్‌రెడ్డి కోరారు. కుటుంబ సభ్యుల పేర్లపై ఉన్నట్లు అనుమానిస్తున్న ఆస్తులు, ఆర్థిక లావాదేవీలపైనా నిబంధనల మేరకు విచారణ చేపట్టాలని సూచించారు. అవసరమైతే అవినీతి నిరోధక శాఖతో దర్యాప్తు చేయించాలని డిమాండ్‌ చేశారు.

గత విధులపైనా విచారణ జరపాలి

గతంలో చీమకుర్తి, గురజాల, ఆత్మకూరు, నెల్లూరు రూరల్‌ ప్రాంతాల్లో విధులు నిర్వహించిన సమయంలోనూ సీఐపై వివిధ ఆరోపణలు వచ్చాయని తెలిపారు. చీమకుర్తి సీఐగా పనిచేసిన సమయంలో ఓ దొంగతనం కేసుకు సంబంధించి నిందితుల నుంచి డబ్బులు తీసుకుని వారిని వదిలేశారనే ఆరోపణలు వచ్చినట్లు ఫిర్యాదులో ప్రస్తావించారు. ఈ వ్యవహారంలో అప్పట్లో సస్పెన్షన్‌కు గురైనట్లు గుర్తు చేశారు. గురజాల సీఐగా పనిచేసిన సమయంలో అప్పటి వైఎస్సార్‌సీపీ చిలకలూరిపేట ఎమ్మెల్యే విడదల రజిని కాల్‌డేటాను సేకరించి ఎంపీ లావు శ్రీకష్ణదేవరాయులుకు అందించారనే ఆరోపణలు కూడా ఉన్నాయన్నారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరులో ఎస్సైగా పనిచేసిన సమయంలో వ్యక్తిగత ప్రవర్తనకు సంబంధించి వివాదాలు, నెల్లూరు రూరల్‌లో అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణలు వచ్చాయన్నారు.

ఎన్నికల వేళ నిష్పాక్షికత కీలకం

ప్రస్తుతం కొడవలూరు సర్కిల్‌ పరిధిలో పేకాట, కోడిపందాలు, బెల్ట్‌షాపులు, చికెన్‌ వ్యర్థాల వ్యాపారానికి సంబంధించి అక్రమ వసూళ్లు జరుగుతున్నాయనే ఆరోపణలు వస్తున్నాయని, వాటిపైనా విచారణ జరపాలని ప్రసన్న కోరారు. విచారణ పూర్తయ్యే వరకు సీఐని వెయిటింగ్‌లో ఉంచాలని డిమాండ్‌ చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో పోలీసు అధికారులు నిష్పాక్షికంగా విధులు నిర్వహించడం అత్యంత కీలకమని, సీఐ దుర్గా ప్రసాద్‌ను ప్రస్తుతం బాధ్యతల నుంచి తప్పించి నాన్‌ ఫోకల్‌ పోస్టింగ్‌కు బదిలీ చేయాలని విజ్ఞప్తి చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement