నెల్లూరు(పొగతోట): స్థానిక ఎన్నికల నిర్వహణకు సంబంధించిన సామగ్రిని జెడ్పీ సమావేశ మందిరం నుంచి శనివారం ఆయా మండలాలకు పంపించారు. నామినేషన్ల స్వీకరణ, విత్‌డ్రా, పోలింగ్, ఓట్ల లెక్కింపు తదితర ప్రక్రియలకు అవసరమైన పత్రాలను జెడ్పీ అధికారులు సిద్ధం చేశారు. ఒక్కో మండలానికి వెయ్యి నుంచి 1,200ల బ్యాలెట్ బాక్సులు అవసరం ఉంది. దానికి అనుగుణంగా సిద్ధం చేసి మండలాలకు పంపారు. పంపిణీ ప్రక్రియను జెడ్పీ సీఈఓ వసుమతి, డిప్యూటీ సీఈఓ బ్రహ్మయ్య పర్యవేక్షించారు.
స్థానిక ఎన్నికలకు
ప్రత్యేకాధికారుల నియామకం
నెల్లూరు(పొగతోట): జెడ్పీటీసీ సభ్యులు, ఎంపీటీసీ ఎన్నికల నిర్వహణకు సంబంధించి మండలాలకు ప్రత్యేక అధికారులను నియమించారు. ఏఆర్వోలుగా ఎంపీడీఓలు వ్యవహరిస్తారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను సేకరించే ప్రక్రియను జెడ్పీ సీఈఓ వసుమతి శనివారం జిల్లా పరిషత్ కార్యాలయంలోని తన చాంబర్‌లో నిర్వహించారు. సొంత నియోజకవర్గాలకు చెందిన అధికారులను ఆయా ప్రాంతాల్లో ఎన్నికల విధులు నిర్వహించకూడదన్నారు. వారిని దూర ప్రాంతాల్లో విధులకు హాజరయ్యేలా డ్యూటీలు వేయాల్సి ఉందన్నారు. దానికి సంబంధించి ప్రత్యేక అధికారులు, ఎంపీడీఓల పూర్తి వివరాలు జెడ్పీ అధికారులు సేకరించారు.
సాగునీటి కాలువలో
గుర్తుతెలియని మృతదేహం
ముత్తుకూరు(పొదలకూరు): నెల్లూరు–ముత్తుకూరు రహదారికి ఎడమవైపున తాళ్లపూడి వద్ద ఉన్న సాగునీటి కాలువలో 35 ఏళ్ల గుర్తుతెలియని వ్యక్తి మృతదేహాన్ని స్థానికులు శనివారం గుర్తించారు. వీఆర్వో ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. పరిసర ప్రాంతాల్లో విచారించినప్పటికీ మృతుడి వివరాలు తెలియరాలేదు. దీంతో ఆయన ముత్తుకూరు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఈపీఎఫ్ దరఖాస్తును
రిజెక్ట్ చేస్తున్నారు
● ఆర్టీసీ జోనల్ చైర్మన్‌కు
రిటైర్డ్ ఉద్యోగుల వినతి
నెల్లూరు సిటీ: ఈపీఎఫ్ కోసం ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగులు దరఖాస్తు చేసుకున్నా రిజెక్ట్ చేస్తున్నారని రిటైర్డ్ ఆఫీసర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ పబ్లిసిటీ సెక్రటరీ మురళీకృష్ణ తెలిపారు. ఈ మేరకు నగరంలోని ఆర్టీసీ కార్యాలయంలో జోనల్ చైర్మన్ సన్నపురెడ్డి సురేష్‌రెడ్డికి శనివారం వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా మురళీకృష్ణ మాట్లాడుతూ ఈపీఎఫ్ నిబంధల ప్రకారం పెన్షన్ సమస్యలను పరిష్కరించాలని కోరారు. కార్యక్రమంలో ఆర్టీసీ యూనియన్ నాయకులు జనార్దన్, సురేష్, అఖిల్, రెహమాన్, మూర్తి పాల్గొన్నారు.
బైక్‌ల ఢీ
● ఒకరి మృతి.. మరొకరికి తీవ్రగాయాలు
కావలి: పట్టణ పరిధిలోని దొంగలగుంట సమీపంలో ఉదయగిరి రోడ్డుపై శనివారం రాత్రి రెండు బైక్‌లు ఎదురెదురుగా ఢీకొన్న ఘటనలో ఒకరు మృతిచెందగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. వివరాలిలా ఉన్నాయి. జలదంకి మండలం జమ్మలపాళేనికి చెందిన కార్తీక్‌రెడ్డి బైక్‌పై కావలి నుంచి స్వగ్రామానికి వెళ్తున్నాడు. జలదంకికి చెందిన రమేష్ బైక్‌పై కావలికి వస్తున్నాడు. దొంగలగుంట సమీపంలో రెండు బైక్‌లు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో కార్తీక్‌రెడ్డి(37) అక్కడికక్కడే మృతిచెందారు. రమేష్‌కు తీవ్రగాయాలు కాగా 108 వాహనంలో ఏరియా వైద్యశాలకు తరలించారు.
28 వాహనాల స్వాధీనం
నెల్లూరు(క్రైమ్): రాజీవ్ గృహకల్పలో శనివారం రాత్రి చిన్నబజారు ఇన్‌స్పెక్టర్ సీహెచ్ సీతారామయ్య తన సిబ్బందితో కలిసి కార్డెన్ అండ్ సెర్చ్ నిర్వహించారు. సరైన పత్రాల్లేని 25 ద్విచక్ర వాహనాలు, మూడు ఆటోలను స్వాధీనం చేసుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అనంతరం ఇన్‌స్పెక్టర్ స్థానిక సిబ్బందితో మాట్లాడారు. దసరా పండగ నేపథ్యంలో ఊర్లకు వెళ్లేవారు ఎల్‌హెచ్‌ఎంఎస్ సేవలను వినియోగించుకోవాలని సూచించారు. ఎస్సైలు విజయకుమార్, అబ్దుల్ రజాక్ పాల్గొన్నారు.


