కాంట్రాక్ట్‌ వైద్య సిబ్బందికి అండగా ఉంటాం | - | Sakshi
Sakshi News home page

కాంట్రాక్ట్‌ వైద్య సిబ్బందికి అండగా ఉంటాం

Oct 11 2026 12:21 AM | Updated on Oct 11 2026 12:21 AM

నెల్లూరు(అర్బన్‌): రెగ్యులరైజ్‌ చేయాలంటూ నాలుగు రోజులుగా విధులు బహిష్కరించి నెల్లూరు ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి వద్ద జేఏసీ ఆధ్వర్యంలో కాంట్రాక్ట్‌ స్టాఫ్‌ నర్సులు, ల్యాబ్‌ టెక్నీషియన్లు, ఫార్మసిస్టులు చేస్తున్న ఆందోళనకు ఏపీ హెల్త్‌ అడ్మినిస్ట్రేషన్‌, మెడికల్‌ సర్వీసెస్‌ అసోసియేషన్‌(హంస) రాష్ట్ర అధ్యక్షడు అరవపాల్‌ శనివారం మద్దతు ప్రకటించారు. అసోసియేషన్‌ జిల్లా అధ్యక్షుడు చేజర్ల సుధాకర్‌రావు తదితరులు ఆందోళనలో పాల్గొని మాట్లాడారు. కేవలం జీతం తప్ప ఇతర ఆదాయం లేని స్టాఫ్‌ నర్సులు, ఎల్టీలు, ఫార్మాసిస్ట్‌లు, ఇతర టెక్నీషియన్లను తక్షణమే రెగ్యులర్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. లేదంటే సమాన పనికి సమాన వేతనం అని చెప్పిన సుప్రీంకోర్టు తీర్పును ఏపీలో కూటమి ప్రభుత్వం అమలు చేయాలని కోరారు. ప్రభుత్వం స్పందించి చర్చలు జరిపి వారికి న్యాయం చేయాలన్నారు. జేఏసీ రాష్ట్ర నిర్వహణ కార్యదర్శి రూత్‌గ్రేస్‌ మాట్లాడుతూ ఏళ్ల తరబడి వైద్యశాఖలో పనిచేస్తున్నప్పటికీ తమకు ఉద్యోగ భద్రత, పీఎఫ్‌, ఈఎస్‌ఏ, డీఏ, సెలవులు లాంటివి లేవన్నారు. తమకు సముచిత ప్రయోజనాలు, సామాజిక భద్రత కల్పించాలని ఆందోళనలు చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో జేఏసీ జిల్లా చైర్మన్‌ శరత్‌బాబు, కన్వీనర్‌ షఫీ, వేణు వందలాది సిబ్బంది పాల్గొన్నారు.

రోగులకు అందని సేవలు

జిల్లా వ్యాప్తంగా సుమారు 700 మంది వరకు నర్సులు, ఇతర సిబ్బంది సమ్మెలో ఉండటంతో రోగులకు వైద్యం అందడం లేదు. ప్రధానంగా పెద్దాస్పత్రిలో రోగులను పలకరించే దిక్కు కనిపించడం లేదు. నర్సింగ్‌ విద్యార్థినుల ద్వారానే సేవలందిస్తున్నారు. వీరు కూడా రాత్రి పూట వార్డుల్లో ఉండరు. దీంతో రాత్రి వేళల్లో రోగులు బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు. మరో వైపు సమ్మెలో పాల్గొనే అందరికీ షోకాజ్‌ నోటీసులను అధికారులు అందిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement