● లక్షలాదిగా తరలివచ్చిన భక్తులు
● దేదీప్యమానంగా విద్యుత్ వెలుగులు
చిల్లకూరు: గూడూరు పట్టణంలో జెండా పండగ ఉత్సవం శనివారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ప్రతి వీధిలో దేదీప్యమానంగా విద్యుత్ వెలుగుల అలంకరణలు, దేవుళ్ల ఆర్చీలు ఆకట్టుకున్నా యి. లక్షలాదిగా భక్తులు తరలి రావడంతో సాయంత్రం నుంచే వీధులన్నీ జనంతో కిక్కిరిశాయి. దీంతో పోలీసులు ముందస్తుగా పట్టణంలోకి వాహనాల రాకపోకలు నిలిపివేసి బనిగేసాహెబ్‌పేట మీదుగా పట్టణంలోకి వచ్చేలా చర్యలు చేపట్టారు.
పోటాపోటీగా..
పట్టణంలోని పలు ప్రాంతాల్లో పోటాపోటీగా జెండా పండగను జరిపారు. చిన్నపాటి జెండాను ఏర్పాటు చేసేందుకు రూ.లక్ష వరకు ఖర్చు చేస్తే.. పెద్ద ఎత్తున జెండా పండగ నిర్వహించే ప్రాంతాల్లో సుమారు రూ.35 లక్షల వరకు ఖర్చు చేస్తున్నారు. దీంతో ఈ ఏడాది రూ.30 కోట్లకు మించి ఖర్చు చేసి ఉండవచ్చని అంచనా.
విచ్చలవిడిగా మద్యం విక్రయాలు
కర్ణాటక రాష్ట్రంలోని మైసూర్ తరువాత భారీస్థాయిలో గూడూరులో జెండా పండగ జరుగుతుంది. సాధారణంగా జాతరలు, తిరునాళ్ల జరిగే ప్రాంతాల్లో ముందస్తుగా మందు షాపులను మూసివేస్తుంటారు. అయితే ఎకై ్సజ్ శాఖ కనీసం గూడూరు పట్టణంలోనైనా మందుషాపులను ఒక్కరోజు మూసి ఉంటే పండగను తిలకించేందుకు వచ్చే మహిళలకు ఊరట లభించేది. అయితే మద్యం దుకాణాలను తెరిచి విచ్చలవిడిగా విక్రయాలు చేస్తుండడంతో తాగిన వారు రోడ్లపై రెచ్చిపోయారు.


