స్తంభించిన వైద్యసేవలు | - | Sakshi
Sakshi News home page

స్తంభించిన వైద్యసేవలు

Oct 8 2026 12:24 AM | Updated on Oct 8 2026 12:24 AM

● నర్సులు లేరు.. స్కానింగ్‌

చేయబోమంటున్న డాక్టర్లు

● కొనసాగుతున్న నిరవధిక సమ్మె

నిరసనలో కూర్చుని చిన్నారికి పాలుపడుతున్న

స్టాఫ్‌ నర్స్‌

నెల్లూరు(అర్బన్‌): తమను రెగ్యులరైజ్‌ చేయాలనే ప్రధాన అజెండాతో కొంతకాలంగా కాంట్రాక్ట్‌ స్టాఫ్‌ నర్సులు, ల్యాబ్‌ టెక్నీషియన్లు, ఫార్మాసిస్టులు, ఇతర టెక్నీషియన్లు వివిధ రూపాల్లో ఆందోళన చేశారు. ఫలితం లేకపోవడంతో వారంతా జేఏసీ ఆధ్వర్యంలో విధులు బహిష్కరించి నిరవధిక సమ్మెకు దిగారు. ఇది బుధవారం రెండో రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా జిల్లాలోని సీహెచ్‌సీలు, పీహెచ్‌సీల్లో పనిచేస్తున్న స్టాఫ్‌ నర్సులు పెద్దాస్పత్రికి చేరుకున్నారు. నర్సింగ్‌ సిబ్బందితో కలిసి సుమారు 700 మందికిపైగా ఒంటికాలిపై నిలబడి గంటల తరబడి ఎండలో నిరసన చేపట్టారు. అంతేకాకుండా సాయంత్రం ప్రదర్శన చేశారు. ఈ సందర్భంగా జేఏసీ రాష్ట్ర ఆర్గనైజింగ్‌ సెక్రటరీ రూత్‌గ్రేస్‌ మాట్లాడుతూ తమ డిమాండ్లు తీర్చే వరకు సమ్మె ఆపే ప్రసక్తే లేదని తెలిపారు. చాలీచాలని వేతనాలతో కుటుంబ పోషణ భారంగా మారిందన్నారు. పిల్లల చదువులు, ఇంటి అద్దెలు, రవాణా చార్జీలు కలుపుకుంటే బతకలేని పరిస్థితి ఏర్పడిందన్నారు. తమ గోడు వినాలని 45 రోజులుగా వివిధ రూపాల్లో ఆందోళనలు చేస్తున్నప్పటికీ ప్రభుత్వం పట్టించుకోకపోవడంతోనే విధిలేని పరిస్థితుల్లో రోడ్డెక్కామన్నారు. రోగులకు వైద్యసేవలు అందకపోవడానికి ప్రభుత్వ తీరే కారణమన్నారు. వీరి ఆందోళనలకు మెడికల్‌ అండ్‌ హెల్త్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ జిల్లా గౌరవాధ్యక్షుడు నరమాల సతీష్‌కుమార్‌, డీవైఎఫ్‌ఐ నాయకులు మద్దతు పలికి సంఘీభావాన్ని ప్రకటించారు.

షోకాజ్‌ నోటీసులిస్తామంటూ బెదిరింపులు

ఆందోళనలో ఉన్న వంద మంది కాంట్రాక్ట్‌ స్టాఫ్‌ నర్సులకు నోటీసులిస్తామంటూ బెదిరింపులు వస్తున్నాయి. ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ మాధవి మాట్లాడుతూ పెద్దాస్పత్రిలో పనిచేస్తున్న వైద్యసిబ్బందికి మాత్రమే ఇక్కడ ఆందోళనలు చేసేందుకు అనుమతిచ్చామన్నారు. పీహెచ్‌సీలు, సీహెచ్‌సీల సిబ్బందికి అనుమతి లేదన్నారు.

విద్యార్థులతో వైద్యసేవలెలా?

నర్సులు సమ్మె బాట పట్టడంతో ప్రైవేటు నర్సింగ్‌ కళాశాలల విద్యార్థినులను పెద్దాస్పత్రిలో విధులకు వేశారు. వారిలో అనేక మందికి సైలెన్‌ ఎలా పెట్టాలో కూడా తెలియదు. రోగులకు వైద్యసేవలందించాలంటే నర్సింగ్‌ కోర్సు పూర్తి చేయడమే కాకుండా ఏపీఎన్‌ఎంసీ ద్వారా రిజిస్టర్‌ అయి ఉండాలి. అయినా ఇక్కడ విద్యార్థులే వైద్యం అందించడం గమనార్హం. రెండు ఐసీయూ వార్డులకు ఒక రెగ్యులర్‌ సిబ్బందిని విధులకు వేశారు. విద్యార్థులతో కలిసి ఆ ఒక్క నర్సు రోగులకు ఎలా వైద్యం అందించగలరో అధికారులకే తెలియాలి.

జిల్లా వ్యాప్తంగా..

నర్సుల సమ్మెతో రోగులకు వైద్యసేవలు అందడం లేదు. పెద్దాస్పత్రితో పాటు పీహెచ్‌సీలు, పీహెచ్‌సీలు, జిల్లా ఆస్పత్రి, ఏరియా ఆస్పత్రుల్లో పనిచేసే స్టాఫ్‌నర్సులు, ల్యాబ్‌ టెక్నీషియన్లకు సంబంధించి వంద మందిలో 80 మంది కాంట్రాక్ట్‌ వారే ఉండటం గమనార్హం. వీరంతా సమ్మె బాట పట్టేసరికి రోగులకు సేవలు చేసేవారు కరువయ్యారు.

రెగ్యులర్‌ చేసేంత వరకు పోరాడుతాం

కాంట్రాక్ట్‌ పద్ధతిలో పనిచేస్తున్న వారిని రెగ్యులర్‌ చేసేంతవరకు ఐక్యంగా పోరాడుతాం. ఎంఎస్సీ, బీఎస్సీ నర్సింగ్‌ చేసిన తమను అన్ని టెస్ట్‌లు నిర్వహించి ప్రభుత్వం ఉద్యోగంలోకి తీసుకుంది. అయినా తమపట్ల చిన్నచూపు చూడడం తగదు.

– టి.మేరీ మాధురి,

స్టాఫ్‌ నర్సు, జీజీహెచ్‌

ప్రభుత్వం స్పందించాలి

తాము గొంతెమ్మ కోర్కెలు కోరడం లేదు. కోవిడ్‌లో సైతం కుటుంబాలకు దూరమై రోగులకు సేవలందించాం. ఎన్నికల సందర్భంగా కాంట్రాక్ట్‌ ఉద్యోగులను రెగ్యులర్‌ చేస్తామని అధికారంలోకి వచ్చాక పట్టించుకోలేదు. దీంతో తాము పోరాటాన్ని ఎంచుకున్నాం. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించాలి.

– హేమలత, సీహెచ్‌సీ, పొదలకూరు

ఖాళీ అవుతున్న వార్డులు

నర్సింగ్‌ సిబ్బంది లేరని బుధవారం అల్ట్రా సౌండ్‌ స్కానింగ్‌ చేయించుకునేందుకు వచ్చిన రోగులను వెనక్కు పంపేశారు. అత్యవసరం అనుకున్న వారికి మాత్రమే స్కానింగ్‌ చేశారు. దీంతో రోజూ రద్దీగా ఉండే స్కానింగ్‌ వద్ద ఖాళీగా ఉండే బెంచీలు కనిపించాయి. రక్త పరీక్షల వద్ద కూడా అర్హత లేని అటెండర్ల చేత పరీక్షలు చేయించారు. వార్డుల్లో వచ్చీరాని వైద్యంతో సేవలు పొందలేని అనేక మంది రోగులు డిశ్చార్జి చేయించుకుని ఇళ్లకు వెళ్లిపోతుండటంతో వార్డులు ఖాళీ అవుతున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement