జిల్లాలోని వేర్వేరు ప్రమాదాల్లో
నలుగురు మరణించారు. ఆటోను బైక్ ఢీకొని ఒకరు, బైక్ అదుపుతప్పి
మరొకరు, కారు ఢీకొని మహిళ, విద్యుత్ షాక్‌తో లైన్‌మెన్ మృత్యువాత పడ్డారు.
బైక్ అదుపుతప్పి..
మనుబోలు: బైక్ అదుపుతప్పి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తలారి రవికుమార్(48) అనే వ్యక్తి మరణించారు. పోలీసుల కథనం మేరకు.. కోవూరు మండలం పోతిరెడ్డిపాడుకు చెందిన రవికుమార్ నెల్లూరు నవాబుపేటలోని రైస్ మిల్లులో పనిచేస్తున్నారు. తడలోని ఓ కంపెనీలో ఉద్యోగం రావడంతో మంగళవారం రాత్రి బైక్‌పై అక్కడికి బయలుదేరారు. మండల పరిధిలోని అప్పయ్యగేటు వద్దకు వచ్చేసరికి బైక్ అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొనడంతో తీవ్రంగా గాయపడ్డాడు. హైవే అంబులెన్స్‌లో నెల్లూరులోని ఆస్పత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ బుధవారం సాయంత్రం మృతిచెందినట్లు పోలీసులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
రోడ్డు దాటుతుండగా..
● కారు ఢీకొని మహిళ మృత్యువాత
దుత్తలూరు(ఉదయగిరి): దుత్తలూరు మండలంలోని నందిపాడు వద్ద రోడ్డు దాటుతున్న మహిళను వేగంగా వచ్చిన కారు ఢీకొని మృతిచెందిన ఘటన బుధవారం చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికుల కథనం మేరకు.. దుత్తలూరు మండలం నందిపాడు పంచాయతీ శ్రీరామ్‌నగర్‌కు చెందిన సంకాల పుల్లమ్మ (55) ఉదయాన్నే పాల కోసం నందిపాడు సెంటర్‌లోని హెచ్‌పీ పెట్రోల్ బంకు సమీపంలో ఓ ఇంటి వద్దకు వెళ్లి తిరిగి వస్తుండగా గుర్తుతెలియని కారు వేగంగా ఢీకొనడంతో ఆమె హైవే పక్కనే ఉన్న ముళ్లపొదల్లో పడిపోయింది. ఈ ఘటనను అక్కడ ఎవరూ చూడలేదు. చాలాసేపటి వరకు పుల్లమ్మ తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు గాలింపు చేపట్టారు. ముళ్లపొదల్లో మృతిచెంది ఉండడం గమనించి పోలీసులకు సమాచారం అందించారు. ఎస్సై సుభాషిణి ఘటనా స్థలానికి చేరుకుని మృతికి కారణమైన వాహనాన్ని సీసీ కెమెరాల్లో పరిశీలించారు. ఆ వాహనం బెంగళూరు వెళ్లినట్లుగా గుర్తించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
విధులకు వెళ్తూ..
● ఆటోను ఢీకొని వ్యక్తి దుర్మరణం
చిల్లకూరు: బైక్‌పై విధులకు వెళ్తున్న వ్యక్తి ఎదురుగా వస్తున్న ఆటోను ఢీకొనడంతో తలకు తీవ్రగాయమై అక్కడికక్కడే మృతిచెందిన ఘటన మండలంలోని తీపనూరు సమీపంలో బుధవారం జరిగింది. పోలీసుల వివరాల మేరకు.. మండలంలోని తీపనూరు గ్రామానికి చెందిన గుంటపూడి సాయికుమార్(31) ఓడూరు రెవెన్యూ పరిధిలోని రొయ్యల పరిశ్రమలో పనిచేస్తున్నారు. ఇతనికి భార్య, ఇద్దరు పిల్లలున్నారు. ఆయన విధులకు బైక్‌పై బయలుదేరి వెళ్తుండగా గ్రామానికి సమీపంలోని చింతలదిబ్బ సమీపంలో ఎదురుగా వస్తున్న ఆటోను ఢీకొన్నాడు. దీంతో సాయికుమార్ తలకు తీవ్రగాయం కావడంతో అక్కడికక్కడే మృతిచెందారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలను సేకరించి ఆటోను అదుపులోకి తీసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గూడూరు ఏరియా ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
విద్యుత్ షాక్‌తో లైన్‌మెన్ మృతి
మనుబోలు: విద్యుత్ షాక్‌తో లైన్‌మెన్ మృతిచెందిన ఘటన మండల పరిధిలోని అక్కంపేట కాలనీలో బుధవారం సాయంత్రం చోటుచేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. వీరంపల్లి సబ్‌స్టేషన్‌లో లైన్‌మెన్‌గా పనిచేస్తున్న అదే గ్రామానికి చెందిన గంధం శీనయ్య(39) విధి నిర్వహణలో భాగంగా అక్కంపేట కాలనీలో కరెంటు స్తంభం ఎక్కి పనిచేస్తుండగా షాక్ తగిలి పడిపోయి అక్కడికక్కడే మృతిచెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గూడూరు ఏరియా ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుడు శీనయ్యకు భార్య అనూష, కుమార్తె, కుమారుడు ఉన్నారు. శీనయ్య మృతితో వీరంపల్లిలో విషాదఛాయలు అలుముకున్నాయి.
మరో ఫీడర్ నుంచి విద్యుత్ సరఫరా
దీనిపై ఏఈ అనిల్‌ను సంప్రదించగా శీనయ్య రెగ్యులర్ ఎల్సీని తీసుకున్నప్పటికీ ఇదే స్తంభానికి మరో ఫీడర్ గుండా కూడా విద్యుత్ సరఫరా ఉండడంతో ప్రమాదం సంభవించినట్లు తెలిపారు.


