నెల్లూరు (పొగతోట): ‘రేషన్ ఇవ్వరు.. ప్రశ్నిస్తే బెదిరింపులు’ అనే శీర్షికతో బుధవారం సాక్షిలో ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు. ఈ మేరకు పలు చౌక దుకాణాల్లో విచారణ చేపట్టారు. కార్డుదారులను బెదిరిస్తూ మాట్లాడిన డీలర్ల నుంచి వివరాలు సేకరించారు. పౌర సరఫరాల అధికారుల విచారణ నివేదికను ఆర్డీఓకు అందించనున్నారు.
చెరువుకట్టపై మంటలు
ఆత్మకూరు: పట్టణంలోని ఆర్టీసీ డిపో ఎగువన గిరిజన కాలనీ సమీపంలో చెరువు కట్ట రెండో నంబర్ అలుగు వద్ద ఆకతాయిలు నిప్పువేయడంతో అక్కడున్న చెట్లతో పాటు కేబుల్స్ అగ్నికి ఆహుతయ్యాయి. ఈ ఘటన మంగళవారం రాత్రి జరగడంతో స్థానిక ప్రజలు భయాందోళనకు గురయ్యారు. వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. వారు వచ్చి సుమారు రెండు గంటల పాటు శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు. సమీపంలోని గిరిజన గుడిసెలు అగ్నికి ఆహుతి కాకుండా నీటిని చల్లారు. పెను ప్రమాదం తప్పడంతో ఊపిరిపీల్చుకున్నారు. నష్టం అంచనాలు ఇంకా తయారు వేయలేదు.
దాడిపై కేసు నమోదు
వెంకటాచలం: మండలంలోని చెముడుగుంట సమీపంలో జాతీయ రహదారి పక్కన ఉన్న నెల్లూరు ఫ్యామిలీ డాబా నిర్వాహకుడు సుదర్శన్‌బాబుపై ఆరుగురు దాడి చేశారని వెంకటాచలం పోలీసులు బుధవారం కేసు నమోదు చేశారు. పోలీసుల వివరాల మేరకు.. సైదాపురం మండలం మొలకలపుండ్ల గ్రామానికి చెందిన నవీన్‌కుమార్ ఈనెల 5న డాబా వద్దకు వచ్చి సిగరెట్ అమ్మకాలకు సంబంధించి నగదు చెల్లింపు విషయమై సుదర్శన్‌బాబుతో గొడవ పడ్డాడు. ఈ క్రమంలో 6వ తేదీన నవీన్‌కుమార్ మరో ఐదుగురిని డాబా వద్దకు తీసుకొచ్చి సుదర్శన్‌బాబుపై దాడి చేశారు. బాధితుడు బుధవారం వెంకటాచలం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
నిమ్మధరలు (కిలో)
పెద్దవి: రూ.125
సన్నవి: రూ.60
పండ్లు: రూ.30


