ప్రశ్నిస్తే బెదిరింపులు | - | Sakshi
Sakshi News home page

ప్రశ్నిస్తే బెదిరింపులు

Oct 7 2026 12:05 AM | Updated on Oct 7 2026 12:05 AM

రేషన్‌ ఇవ్వరు..

డీలర్ల దోపిడీ

● బియ్యం లేవు.. డబ్బులు తీసుకోండంటూ సాకులు

● థంబ్‌ వేశాక.. ఆధార్‌ లింక్‌ కాలేదంటూ సరుకులు ఇవ్వని వైనం

● పట్టపగలే పేదల బియ్యం అక్రమ రవాణా

నెల్లూరు(పొగతోట): రేషన్‌ కార్డుదారులకు కూటమి ప్రభుత్వంలో తీవ్ర ఇబ్బందులు తప్పడం లేదు. చౌకదుకాణాలకు వెళ్తే ‘బియ్యం లేవు.. అయిపోయాయి’, ‘రేషన్‌ కార్డుకు ఆధార్‌ లింక్‌ కాలేదు’, ‘ఆధార్‌కు ఫోన్‌ నంబర్‌ లింక్‌ కాలేదు’ అంటూ కొందరు డీలర్లు సాకులు చెబుతున్నారు. దీంతో రేషన్‌ అందక లబ్ధిదారులు ఖాళీ చేతులతో వెనుదిరగాల్సి వస్తోంది. ఎవరైనా డీలర్లను ప్రశ్నిస్తే ‘మీకు దిక్కున్న చోట చెప్పుకోండి.. కార్పొరేటర్‌కు, ఎమ్మెల్యేకు, మంత్రికి ఫిర్యాదు చేసుకోండి’ అంటూ బెదిరింపులు ఎదురవుతున్నాయి.

థంబ్‌ వేసినా..

థంబ్‌ వేసినా డీలర్లు బియ్యం ఇవ్వని పరిస్థితి ఉంది. లబ్ధిదారు పూర్తి వివరాలను నమోదు చేసి ఆన్‌లైన్‌లో ‘సక్సెస్‌’ అని వచ్చినా పట్టించుకోవడం లేదు. ఫోన్‌ నంబర్‌కు ఆధార్‌ కార్డు లింక్‌ అయిందని కార్డుదారులు చెబుతున్నా వినిపించుకోవడం లేదని విమర్శలున్నాయి.

డబ్బులు తీసుకోండి

నాలుగు రోజుల క్రితం నెల్లూరు ఏసీనగర్‌ పరిసర ప్రాంతాల్లోని చౌకదుకాణాలకు వెళ్లిన పలువురు కార్డుదారులు, ముఖ్యంగా వృద్ధ మహిళలు, బియ్యం ఇవ్వాలని కోరగా ‘బియ్యం అయిపోయాయి.. డబ్బులు ఇస్తాం తీసుకెళ్లండి’ అంటూ డీలర్లు సమాధానం ఎదురైంది. నగరంలోని అధిక శాతం చౌకదుకాణాల్లో ఇదే పరిస్థితి నెలకొంది. ప్రతినెలా 3, 4 తేదీలకే బియ్యం అయిపోయాయంటూ నో స్టాక్‌ బోర్డులు ఏర్పాటు చేస్తున్నారు.

జిల్లాలో 1,470 చౌకదుకాణాలు

జిల్లా వ్యాప్తంగా 1,470 చౌకదుకాణాలు ఉండగా, సుమారు 7.21 లక్షల రేషన్‌ కార్డులున్నారు. ప్రతినెలా సుమారు 12 వేల మెట్రిక్‌ టన్నుల బియ్యాన్ని కార్డుదారులకు పంపిణీ చేస్తున్నారు. అయితే ఇందులో సుమారు 8 వేల మెట్రిక్‌ టన్నుల బియ్యం అక్రమ మార్గంలో తరలిపోతున్నాయనే ఆరోపణలున్నాయి. కేజీ రూ.17 నుంచి రూ.20 వరకు కొనుగోలు చేసి, పాలిష్‌ పట్టిన అనంతరం బహిరంగ మార్కెట్‌లో కేజీ రూ.75 నుంచి రూ.80 వరకు విక్రయిస్తున్నారు. రవాణా, పాలిషింగ్‌ తదితర ఖర్చులు పోను కేజీకి సుమారు రూ.45 వరకు ఆదాయం వస్తుంది.

నెలకు రూ.కోట్లలో వ్యాపారం

చౌకదుకాణాల నుంచి అక్రమంగా తరలించిన పేదల బియ్యాన్ని పాలిష్‌ చేసి ఇతర రాష్ట్రాలకు, దేశాలకు తరలించి విక్రయిస్తున్నారు. టన్ను బియ్యంపై సుమారు రూ.45 వేల వరకు ఆదాయం వస్తుంది. ఈ లెక్కన నెలకు రూ.కోట్లలో అక్రమ వ్యాపారం జరుగుతున్నట్లు అంచనా. ఇందులో పైస్థాయి నుంచి కింది స్థాయి అధికారులు, ప్రజాప్రతినిధుల వరకు వాటాలు అందుతున్నాయనే ప్రచారం ఉంది.

పట్టపగలే అక్రమ రవాణా

బియ్యం అక్రమ రవాణా చేసే వాహనాలు పట్టపగలే తిరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. మాఫియాకు సంబంధం లేని వాహనాల్లో బియ్యం తరలిస్తే మాత్రం దాని నంబర్‌, ఎక్కడి నుంచి బయలుదేరింది?, ఏ మార్గంలో వస్తుందనే సమాచారం అధికారులకు చేరుతోంది. అలాంటి వాహనాలనే పట్టుకుంటున్నారనే ఆరోపణలున్నాయి. నిత్యం అక్రమంగా బియ్యం తరలించే లారీలపై అధికారులు, పోలీసులు చర్యలు తీసుకోవడం లేదు. బియ్యం అక్రమ రవాణాకు అధికార పార్టీ నాయకులు, అధికారులు, పోలీసులు సహకరిస్తున్నారని తెలిసింది. దీనివల్ల కొందరు డీలర్లు అధికారులను సైతం లెక్కచేయడం లేదు.

నెల్లూరు పొదలకూరు రోడ్డు ప్రాంతానికి చెందిన ఒక సీనియర్‌ సిటిజన్‌ (70 ఏళ్లు). ఆయన నేతాజీనగర్‌లోని రేషన్‌ దుకాణం (ఐడీ నంబరు 0982080)లో సరుకులు కావాలని వెళ్లారు. డీలర్‌ థంబ్‌ వేయించుకున్నాక.. ఫోన్‌ నంబరు అడిగి ఇది లింక్‌ కాలేదని, సరుకులు ఇవ్వని చెప్పాడు. ఇదే నంబరుతో ఆధార్‌ లింక్‌ అయింది.. నా కార్డుకు సంబంధించి థంబ్‌ సరిపోయింది.. సరుకులు ఎందుకు ఇవ్వరని అడిగితే సరైన సమాధానం చెప్పలేదు. స్థానిక కార్పొరేటర్‌కు చెబుతాను అంటే.. ఎవడికై నా చెప్పుకో ఏమైనా చేసుకో అంటూ అవమానకరంగా డీలర్‌ మాట్లాడారు. దీంతో కార్డుదారుడు ఆధార్‌ ఎన్‌రోల్‌ సెంటర్‌కు వెళ్లి అడిగితే ఫోన్‌ నంబరు లింక్‌ అయిందని చెప్పారు. తిరిగి డీఎస్‌ఓ ఆఫీస్‌కు వెళ్లి ఫిర్యాదు చేయడంతో అక్కడి అధికారులు సదరు డీలర్‌కు ఫోన్‌ చేసి.. సీనియర్‌ సిటిజన్‌కు సరుకులు ఇచ్చి పంపించు అంటూ సున్నితంగా చెప్పడంతో ఎట్టకేలకు సరుకులు ఇచ్చి పంపించారు.

మరుసటి రోజు వేదాయపాళెం ప్రాంతానికి చెందిన మరో వ్యక్తి కూడా అదే రేషన్‌ దుకాణానికి సరుకుల కోసం వెళ్తే.. ఆ సీనియర్‌ సిటిజన్‌కు జరిగిన పరిణామాలకే ఎదురయ్యాయి. దీంతో సదరు కార్డు దారుడు సైతం డీఎస్‌ఓ కార్యాలయ అధికారులకు ఫోన్‌ చేసి ఫిర్యాదు చేయడంతో వారు డీలర్‌కు ఫోన్‌ చేసి సరుకులు ఇచ్చి పంపాలని చెప్పారు. దీంతో డీలర్‌ సరుకులు ఇవ్వకుండా గంటల తరబడి నిరీక్షణ చేయించి చివరకు సరుకులు ఇచ్చి పంపించారు.

మార్కెట్లో బియ్యం ధరలు ఎగబాకుతుండడంతో చౌకదుకాణాల ద్వారా పేదలకు అందాల్సిన బియ్యాన్ని డీలర్లు పక్కదారి పట్టిస్తున్నారు. కొందరు కార్డుదారులకు సక్రమంగా బియ్యం పంపిణీ చేయకుండా రకరకాల సాకులు చెబుతూ

ఇబ్బందులకు గురి చేస్తున్నారు. మరో వైపు మాఫియా బియ్యాన్ని అక్రమంగా తరలించి సొమ్ము చేసుకుంటోంది. థంబ్‌ వేయించుకుని బియ్యం, సరుకులు ఇవ్వకుండా.. ఇబ్బందులకు గురి చేయడాన్ని సదరు డీలర్‌పై డీఎస్‌ఓ కార్యాలయం అధికారులకు ఫిర్యాదు చేసినా.. చర్యలు తీసుకోకపోగా, సరుకులు ఇచ్చి పంపించాలని సున్నితంగా చెప్పడం చూస్తే.. డీలర్ల అవినీతిలో వీరికి భాగస్వామ్యం

ఉందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement