● అనుమానమే కారణం ● రుద్రకోటలో ఘటన
కావలి: కట్టుకున్న భార్యపై అనుమానం పెంచుకుని కిరాతకుడిగా మారాడు. మద్యం తాగి ఆమె గొంతు కోసి హత్య చేశాడు. ఈ ఘటన కావలి రూరల్ మండలం రుద్రకోటలో మంగళవారం చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసుల కథనం మేరకు.. గ్రామ గిరిజన కాలనీకి చెందిన మానికల ఏడుకొండలు ఇటుక బట్టీలో పనిచేస్తుంటాడు. అతడికి మానికల సుబ్బులు అలియాస్ సుగుణ (40)తో రెండో వివాహమైంది. వారికి పిల్లలు లేరు. సంవత్సరం మొత్తం ఇతర ప్రాంతాల్లో ఉంటుంటారు. ఈనెల ఒకటో తేదీన వారు గ్రామానికి విచ్చేశారు. ఏడుకొండలు పింఛన్ సొమ్ము తీసుకున్నాడు. ఇతనికి భార్యపై అనుమానం ఉంది. ఈ క్రమంలో సుగుణను తీసుకుని స్థానిక రైతు వెంకయ్య పొలంలోకి వెళ్లాడు. ఇద్దరూ కలిసి మద్యం తాగుతుండగా స్థానికులు చూశారు. కాసేపటికి ఏమైందో గానీ ఏడుకొండలు భార్య గొంతుకోసి హతమార్చాడు. అక్కడి వారు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. రూరల్ సీఐ రాజేశ్వరరావు తన సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కావలి ఏరియా వైద్యశాలకు తరలించారు. కాగా ఏడుకొండలు పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.
కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకున్నాం
● ఏపీఎస్సీపీసీఆర్ సభ్యురాలు వెంకట పద్మలత
నెల్లూరు(అర్బన్): నెల్లూరులో జ్యోతినగర్ రైల్వేట్రాక్ సమీపంలోని ఓ చర్చి వద్ద బాలికపై లైంగికదాడికి పాల్పడిన నిందితుడికి కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకున్నామని ఏపీ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యురాలు కేజీ వెంకట పద్మలత తెలిపారు. ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మానసిక దివ్యాంగురాలైన బాధిత బాలికను మంగళవారం ఆమె పరామర్శించారు. అనంతరం మాట్లాడుతూ బాధితురాలి తల్లి కోరిన విధంగా నైపుణ్యాభివృద్ధి ద్వారా జీవనోపాధికి సహకారం అందిస్తామని చెప్పారు. బాలికపై అఘాయిత్యానికి పాల్పడిన నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారన్నారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా అన్ని ప్రభుత్వ శాఖలు సమన్వయంతో పనిచేయాలని అధికారులకు సూచించారు. పాఠశాలల్లో మొబైల్ ఫోన్ల వినియోగం, ఆన్‌లైన్ వేధింపుల నియంత్రణ తదితర అంశాలపై విద్యార్థులు, తల్లిదండ్రులకు అవగాహన కల్పించేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. కార్యక్రమంలో సర్వజన ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కొండేటి మాధవి, ఐసీడీఎస్ పీడీ నాగశైలజ తదితరులు పాల్గొన్నారు.


