నెల్లూరు(అర్బన్): ఓబీసీ సమగ్ర కులగణన జరిపేలా అసెంబ్లీలో కూటమి ప్రభుత్వం తీర్మానం చేసి కేంద్రానికి పంపాలని బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు షేక్ సలీమ్ డిమాండ్ చేశారు. పలువురు బీసీ సంఘం నాయకులతో కలిసి ఆయన సోమవారం నెల్లూరులో కలెక్టర్ హిమాన్షు శుక్లాకు వినతిపత్రం ఇచ్చారు. అనంతరం సలీమ్ మాట్లాడుతూ సమగ్ర కులగణన జరుపుతామని చెప్పిన ఎన్‌డీఏ ప్రభుత్వం జనగణన ఫార్మెట్‌లో ఓబీసీ కాలం పెట్టలేదన్నారు. విడివిడిగా ఒక్కో కులానికి ఒక యూనిక్ నంబర్ కూడా కేటాయించకుండా కేంద్ర ప్రభుత్వం బీసీలను మభ్యపెడుతోందన్నారు. కూటమి ప్రభుత్వం అసెంబ్లీ తీర్మానం చేసి కేంద్రంపై ఒత్తిడి పెంచాలని కోరారు. కార్యక్రమంలో నేతలు పలమాల శ్రీహరిరావు, శైలజ, నర్మదాబాయి, మాల్యాద్రి, కిరణ్, లాయర్ తరుణ్‌సింగ్ తదితరులు పాల్గొన్నారు.


