● కలెక్టర్ కార్యాలయానికి పోటెత్తిన ప్రజలు
● అధికారులకు వినతుల అందజేత
నెల్లూరురూరల్: ‘అయ్యా.. సమస్య చెప్పుకునేందుకు ఎన్నో కష్టాలకోర్చి ఇక్కడికి వచ్చాం. మీరు కనికరించండి’ అంటూ ప్రజలు కోరారు. సోమవారం నెల్లూరు కలెక్టరేట్‌లోని తిక్కన ప్రాంగణంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో కలెక్టర్ హిమాన్షు శుక్లా, జేసీ మొగిలి వెంకటేశ్వర్లు, డీఆర్వో విజయకుమార్, మెప్మా పీడీ కిరణ్ కుమార్, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ డిప్యూటీ డైరెక్టర్ నాగశేఖర్, ఐటీపీఏ పీఓ శ్రీనివాస్, డిప్యూటీ కలెక్టర్ వంశీకృష్ణ తదితరులు ప్రజల నుంచి వినతులు స్వీకరించారు.
కారు వినియోగంపై విచారణ జరపాలి
దివ్యాంగుల సంక్షేమ శాఖకు సంబంధించిన హైరింగ్ వాహనం వినియోగం, ట్రెజరీ బిల్లులపై సమగ్ర విచారణ జరపాలని వైఎస్సార్‌సీపీ దివ్యాంగుల విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఆవుల నాగేంద్ర డిమాండ్ చేశారు. జేసీకి వినతిపత్రం అందజేశారు. ఆయన మాట్లాడుతూ 2019 నుంచి 2026 వరకు దివ్యాంగుల ప్రభుత్వ కార్యకలాపాల కోసం కారు వినియోగించినట్లు ఆర్టీఐ ద్వారా సమాచారం అందిందన్నారు. అయితే కార్యాలయంలో కారు వినియోగించిన దాఖలాల్లేవన్నారు. దీనిపై జేసీ స్పందించి దివ్యాంగుల సంక్షేమ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ అయూబ్‌ను వివరణ కోరగా, ప్రస్తుతం వాహనం వినియోగించడం లేదని సమాధానం ఇచ్చినట్లు తెలిపారు. కార్యాలయంలోని సీసీ కెమెరా ఫుటేజీ, వాహనానికి సంబంధించిన పూర్తి నివేదికను సమర్పించాలని జేసీ ఆదేశించినట్లు పేర్కొన్నారు.
ఉద్యోగులు ఇబ్బంది పడుతున్నారు
వీబీ జీ రామ్‌జీలో వివిధ హోదాల్లో పనిచేస్తున్న ఉద్యోగుల సమస్యలను ఈనెల 10వ తేదీలోగా పరిష్కరించాలని సంఘాలు కోరాయి. నేతలు మాట్లాడుతూ జీతభత్యాల్లో పెంపుదల లేకపోవడంతో పెరుగుతున్న నిత్యావసర ధరల నేపథ్యంలో ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. సమస్యలు పరిష్కరించకపోతే అన్ని సంఘాలతో సమావేశమై తదుపరి కార్యాచరణ ప్రకటిస్తామని మందపల్లి రామచంద్రయ్య తెలిపారు.
గురుకులాన్ని పునఃప్రారంభించాలంటూ..
కోటలోని గురుకుల పాఠశాలను పునఃప్రారంభించి విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని పీడీఎస్‌యూ నాయకులు కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. వారు మాట్లాడుతూ విద్యార్థులను వాకాడు, నాయుడుపేట గురుకులానికి తరలించారని, దీంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. నిద్రించేందుకు సరిపడా గదుల్లేక అవస్థలు పడుతున్నట్లు చెప్పారు. స్పందించిన కలెక్టర్ సాంఘిక సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీతో మాట్లాడి సమస్యను త్వరగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారన్నారు. కార్యక్రమంలో కె.ఆశీర్, కె.చరణ్, సాయిచరణ్ పాల్గొన్నారు.


