స్పందించకుంటే రేపట్నుంచి నిరవధిక సమ్మె | - | Sakshi
Sakshi News home page

స్పందించకుంటే రేపట్నుంచి నిరవధిక సమ్మె

Oct 6 2026 12:12 AM | Updated on Oct 6 2026 12:12 AM

● కాంట్రాక్ట్‌ వైద్య సిబ్బంది హెచ్చరిక

● కలెక్టరేట్‌ వద్ద ఆందోళన

నెల్లూరు(అర్బన్‌): తమ సమస్యలపై ప్రభుత్వం స్పందించకుంటే బుధవారం నుంచి అన్ని ప్రభుత్వాస్పత్రుల్లో నిరవధిక సమ్మె చేపడతామని కాంట్రాక్ట్‌ నర్సులు, ల్యాబ్‌ టెక్నీషియన్లు, ఇతర వైద్య సిబ్బంది తెలిపారు. వందలాది మంది సిబ్బంది ఏపీ జేఏసీ ఆధ్వర్యంలో సోమవారం నెల్లూరు కలెక్టరేట్‌ వద్దకు చేరుకుని నిరసన తెలిపారు. వీరికి యునైటెడ్‌ మెడికల్‌ అండ్‌ హెల్త్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ గౌరవాధ్యక్షుడు నరమాల సతీష్‌కుమార్‌, సందాని బాషా తదితరులు మద్దతు తెలిపి మాట్లాడారు. శాశ్వత స్వభావం కలిగిన వైద్య సేవల్లో కాంట్రాక్ట్‌ విధానం కొనసాగించడం వల్ల ఉద్యోగులు హక్కులు కోల్పోతున్నారని పేర్కొన్నారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. జేఏసీ రాష్ట్ర నాయకురాలు రూత్‌ గ్రేస్‌, ల్యాబ్‌ టెక్నీషియన్‌ యూనియన్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గోపీకృష్ణ, నాయకురాలు జ్యోష్ణ మాట్లాడుతూ మెరిట్‌, రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ ప్రకారం ఎంపికై విధులు నిర్వహిస్తున్న తమను కాంట్రాక్ట్‌ సిబ్బందిగా కొనసాగించడం సరికాదన్నారు. కనీస వేతనాలు, సంక్షేమ పథకాలు, ఈఎస్‌ఐ వంటి సౌకర్యాలు పూర్తిస్థాయిలో అందడం లేదని తెలిపారు. నెలరోజులకు పైగా శాంతియుతంగా ఆందోళనలు చేస్తున్నా సమస్యలు పరిష్కారం కాలేదని తెలిపారు. ప్రభుత్వం మంగళవారం లోగా స్పందించకుంటే బుధవారం నుంచి నిరవధిక సమ్మెకు వెళ్తామని స్పష్టం చేశారు. అనంతరం కలెక్టర్‌ హిమాన్షు శుక్లాను కలిసి వినతిపత్రం అందజేశారు. సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని కలెక్టర్‌ సానుకూలంగా స్పందించినట్లు వారు తెలిపారు. సాయంత్రం వరకు ఆందోళన కొనసాగింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement