వన్యప్రాణి భూముల్లో అక్రమార్కుల పాగా | - | Sakshi
Sakshi News home page

వన్యప్రాణి భూముల్లో అక్రమార్కుల పాగా

Oct 2 2026 11:50 PM | Updated on Oct 2 2026 11:50 PM

వాకాడు: ప్రభుత్వ భూములకు రక్షణ కల్పించాల్సిన యంత్రాంగం నిఘా కొరవడటంతో ఆక్రమణలు పెరుగుతున్నాయి. వాకాడు, చిట్టమూరు మండలాల పరిధిలోని అటవీ, వన్యప్రాణి సంరక్షణకు సంబంధించిన భూముల్లో కొందరు అక్రమంగా ప్రవేశించి భూములను చదును చేసి సాగుకు వినియోగిస్తున్నారన్న విమర్శలున్నాయి. కొందరు అధికార పార్టీ నేతలు నిబంధనలకు విరుద్ధంగా భూములను చదును చేయించి సాగుకు వినియోగిస్తున్నా సంబంధిత అధికారులు పట్టించుకోవడంలేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

తీర ప్రాంత భూములపై కన్ను

తీర ప్రాంతానికి ఆనుకుని ఉన్న ప్రభుత్వ అటవీ భూములపై కొందరు కన్నేసినట్లు స్థానికులు చెబుతున్నారు. వాటిని చదును చేసి సాగు చేసుకోవడంతోపాటు హద్దులను మార్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపిస్తున్నారు. ఒకసారి ఆక్రమణకు గురైన భూములను తిరిగి ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకురావడంలో అధికారులు విఫలమవుతున్నారన్న విమర్శలున్నాయి.

నిబంధనల పేరుతో వసూళ్లా?

అటవీ, వన్యప్రాణి భూముల్లో పనులు చేపట్టే విషయంలో నిబంధనలు, అనుమతుల పేరుతో కొందరు వ్యక్తులు డబ్బులు వసూలు చేస్తున్నారని ప్రచారం జరుగుతోంది. అనుమతులు లేకుండానే భూముల్లో పనులు జరుగుతున్నా చర్యలు తీసుకోవడం లేదని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. ఈ వ్యవహారంపై ఉన్నతాధికారులు సమగ్ర విచారణ చేపట్టాలని కోరుతున్నారు.

35 ఎకరాల భూమిపై వివాదం

సుమారు 35 ఎకరాల ఉప్పుటేరు భూములపై నిడిగుర్తి మాజీ సర్పంచ్‌, టీడీపీ నేత డేగ కన్ను పడింది. గిరిజనుల పేరు చెప్పి ఆ భూములను చదును చేస్తూ చాప కింద నీరులా కబ్జాకు ప్రయత్నం చేస్తున్నారని గిరిజనులు ఆరోపిస్తున్నారు. అధికారులు అక్రమార్కుల నుంచి భారీగా ముడుపులు తీసుకుని పట్టించుకోవడం లేదని స్థానికులు చెబుతున్నారు. ప్రస్తుతం ఆ భూములకు సంబంధించి వివాదం ఉంది.

కళ్లముందే కనిపిస్తున్నా..

వాకాడు, చిట్టమూరు మండలాల్లో దాదాపు 14.5 వేల ఎకరాల అటవీ, వైల్డ్‌ లైఫ్‌ భూములున్నాయి. అందులో సుమారు 89 ఎకరాల వరకు కబ్జాకు గురైనట్లు తెలుస్తోంది. సదరు భూములున్న ప్రాంతాల్లో నిబంధనలు అడ్డం పెట్టుకుని కొందరు అటవీ అధికారులు వసూళ్లకు పాల్పడున్నారు. అటవీ, రెవెన్యూ శాఖలు సంయుక్తంగా సర్వే నిర్వహించి భూముల హద్దులను నిర్ధారించాలనే డిమాండ్‌ జనం నుంచి వినిపిస్తోంది.

ఉన్నతాధికారుల నిఘా అవసరం

వాకాడు, చిట్టమూరు మండలాల్లోనే ప్రభుత్వ అటవీ భూములపై ప్రత్యేక దృష్టి సారించి ఆక్రమణలపై సమగ్ర విచారణ జరపాల్సిన అవసరం ఉంది. అక్రమాలకు అడ్డుకట్ట వేయకపోతే భవిష్యత్‌లో మరెన్ని ప్రభుత్వ భూములు అన్యాక్రాంతమయ్యే ప్రమాదముంది.

కళ్లముందే జరుగుతున్నా

చర్యలు శూన్యం

వాకాడు, చిట్టమూరు

మండలాల్లో యఽథేచ్ఛగా సాగు

నిబంధనల పేరుతో వసూళ్లు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement