● యథేచ్ఛగా మద్యం విక్రయాలు
ఉదయగిరి: గాంధీ జయంతిని పురస్కరించుకుని మద్యం విక్రయాలను నిషేధించినప్పటికీ ఉదయగిరి నియోజకవర్గంలో శుక్రవారం పలుచోట్ల యథావిధిగా అమ్మకాలు సాగాయి. అధికారికంగా మద్యం దుకాణాలను మూసివేసినప్పటికీ, ముందుగానే పెద్ద మొత్తంలో ఇతర ప్రాంతాల్లో నిల్వ చేశారు. ఎంపిక చేసిన ప్రాంతాల్లోని కూల్‌డ్రింక్ షాపుల్లో విక్రయించారు. గ్రామీణ ప్రాంతాల్లో బెల్ట్ షాపుల ద్వారా మద్యం విక్రయాలు సాధారణ రోజుల మాదిరిగానే కొనసాగించారు. నిషేధం అమలయ్యేలా చర్యలు తీసుకోవాల్సిన అధికారులు వీటిపై పెద్దగా దృష్టి సారించలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు.
లారీని ట్రావెల్స్ బస్సు
ఢీకొని..
● ఒకరి దుర్మరణం
కావలి: కావలి మండలం రుద్రకోట సమీపంలో జాతీయ రహదారిపై శుక్రవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతిచెందాడు. రూరల్ పోలీసుల కథనం మేరకు.. విజయవాడ వైపు వెళ్తున్న ట్రావెల్స్ బస్సు లారీని ఓవర్‌టేక్ చేయబోయి ఢీకొట్టింది. దీంతో లారీ డ్రైవర్ మహేష్ (27) అక్కడికక్కడే మృతిచెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కావలి ఏరియా వైద్యశాలకు తరలించారు. కేసు నమోదు చేశారు. మృతుడిని కర్ణాటక రాష్ట్రంలోని కోలార్ వాసిగా గుర్తించారు.
రెగ్యులర్ చేసే వరకూ
పోరాటం ఆగదు
నెల్లూరు(అర్బన్): తమను రెగ్యులర్ చేసే వరకూ పోరాటం ఆపే ప్రసక్తి లేదని ఏపీ కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సెస్ అండ్ అల్లాయిడ్ హెల్త్ కేర్ ఫ్రొఫెషనల్స్ జేఏసీ రాష్ట్ర నాయకురాలు రూత్ గ్రేస్ స్పష్టం చేశారు. శుక్రవారం నెల్లూరు దర్గామిట్టలోని సర్వజన ఆస్పత్రి (పెద్దాస్పత్రి) నుంచి గాంధీబొమ్మ వరకు సైకిల్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం గాంధీ విగ్రహం వద్ద వినతిపత్రం ఉంచారు. ప్రభుత్వానికి తమను రెగ్యులర్ చేసేలా మంచి బుద్ది ప్రసాదించాలని వేడుకున్నారు. రూత్ గ్రేస్ మాట్లాడుతూ 20 ఏళ్లుగా కాంట్రాక్ట్ పద్ధతిలో అతి తక్కువ జీతంతో పని చేస్తున్నామన్నారు. రెగ్యులర్ వారిలా సెలవులు ఇవ్వడం లేదని, డీఏలు లేవని ఆవేదన వ్యక్తం చేశారు. సుప్రీం కోర్టు కూడా సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని తీర్పు ఇచ్చినప్పటికీ ప్రభుత్వాలు పట్టించుకోకపోవడం అన్యాయమన్నారు. తమ బిడ్డల భవిష్యత్ కోసమే పోరాడుతున్నామన్నారు. రెగ్యులర్ చేసేంత వరకు 100 శాతం గ్రాస్ శాలరీ ఇవ్వాలన్నారు. ప్రభుత్వం కోరడంతో కొంత గడువు ఇచ్చామన్నారు. ఇప్పటికై నా తమను రెగ్యులర్ చేసి ఆదుకోవాలని లేదంటే పూర్తిస్థాయి సమ్మె చేస్తామన్నారు. కార్యక్రమంలో జేఏసీ చైర్మన్ శరత్‌బాబు, భావన, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
పోలేరమ్మ జాతరలో
రూ.59 లక్షల రాబడి
వెంకటగిరి రూరల్: వెంకటగిరిలో అత్యంత వైభవంగా నిర్వహించిన పోలేరమ్మ జాతరలో రూ.59,02,903 లక్షల రాబడి వచ్చినట్లు ఈఓ వెంకట శ్రీనివాసులురెడ్డి తెలిపారు. శుక్రవారం ఆయన వివరాలు వెల్లడించారు. రూ.300 దర్శన క్యూలైన్ ద్వారా రూ.24,01,200 లక్షలు, రూ.100 క్యూలైన్ ద్వారా రూ.10,29,600 లక్షలు వచ్చాయన్నారు. భక్తులు హుండీలో రూ.24,72,103లను కానుకల రూపంలో సమ ర్పించారన్నారు. ఇంకా బంగారం, విదేశీ కరెన్సీ, వెండి వచ్చాయన్నారు. లెక్కింపు కార్యక్రమంలో తిరుపతి జిల్లా దేవదాయ శాఖ జూనియర్ సహాయకుడు దినేష్, సేవా కమిటీ చైర్మన్ గొల్లగుంట మురళి, భక్తులు పాల్గొన్నారు.


