బుచ్చిరెడ్డిపాళెం: స్కూల్ మేనేజ్‌మెంట్ కమిటీ (ఎస్‌ఎంసీ) ఎన్నికల సందర్భంగా చోటుచేసుకున్న తోపులాట, దాడుల ఆరోపణలు దామరమడుగులో ఉద్రిక్తతకు దారితీశాయి. ఎన్నికల సమయంలో తమపై దాడి చేసి, కులం పేరుతో దూషించారని కొందరు బాధితులు ఆరోపిస్తూ.. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. శుక్రవారం కొందరు గ్రామస్తులు దామరమడుగు బాంబే హైవే సెంటర్‌లో టీడీపీ నేత బెజవాడ జగదీశ్ దిష్టిబొమ్మను దహనం చేశారు. కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని ఆందోళనకారులను చెదరగొట్టి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు.
బాధితులకు వైఎస్సార్‌సీపీ నేతల మద్దతు
మాజీ మంత్రి, పీఏసీ సభ్యుడు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి ఆదేశాల మేరకు దామరమడుగు వైఎస్సార్‌సీపీ నాయకుడు షేక్ దస్తగిరి బాషా స్పందించారు. దాడికి గురైన సీపీఎం నాయకుడు సురేష్‌కు మద్దతు తెలిపారు. శాంతియుతంగా జరగాల్సిన ఎస్‌ఎంసీ ఎన్నికల్లో దౌర్జన్యం, దాడులకు పాల్పడటం సరికాదన్నారు. కాగా పోలీసుల జోక్యంతో పరిస్థితి సద్దుమణిగింది. ఎస్‌ఎంసీ ఎన్నికల సందర్భంగా జరిగిన తోపులాట, దాడుల ఆరోపణలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కార్యక్రమంలో గరికపాటి నాగార్జున, గరికపాటి శ్రీనివాసులు, నవీన్‌కుమార్, చంద్రకుమార్, గోవిందు, వెంకటేశ్వర్లు, అహ్మద్‌బాషా తదితరులు పాల్గొన్నారు.


