నెల్లూరు(వేదాయపాళెం): యానాదులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీని వెంటనే నెరవేర్చాలని యానాదుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేసీ పెంచలయ్య డిమాండ్ చేశారు. యానాదులకు ఎస్టీ వర్గీకరణ, ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలనే డిమాండ్లతో శుక్రవారం నెల్లూరులోని సుబేదారుపేటలోని వెన్నెలకంటి రాఘవయ్య భవన్ నుంచి గాంధీ విగ్రహం వరకు సంఘం ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పెంచయ్య మాట్లాడుతూ ఎన్నికల సమయంలో కూటమి పార్టీ ల నేతలు యానాదులకు ఇచ్చిన హామీలను విస్మ రించారని విమర్శించారు. తమ న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించకపోతే నవంబర్‌లో రాష్ట్రవ్యాప్తంగా ధూమ్‌ధామ్ కార్యక్రమం నిర్వహిస్తామని హెచ్చరించారు. యానాదులకు ఎస్టీ వర్గీకరణ కోసం ప్రత్యేక కమిషన్‌ను ఏర్పాటు చేసి, ఆ కమిషన్ నివేదిక ఆధారంగా వర్గీకరణ ప్రక్రియను వెంటనే చేపట్టాలని డిమాండ్ చేశారు. గాంధీ మాస్కులు ధరించి.. ‘ఎస్టీ వర్గీకరణ చేపట్టాలి’, ‘మహాత్మా.. మీరైనా కరుణించండి’ అంటూ నినాదాలు చేశారు. కార్యక్రమంలో ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు మానికల మురళి, రాపూరు కృష్ణయ్య, చెంబేటి ఉష, తిరివీధి సతీష్, యల్లంపల్లి రమేష్, బిట్ర ప్రసాద్, కల్లూరు పెంచలప్రసాద్, రేపల్లె మధు, చలంచర్ల చినసుబ్బయ్య, వేణు, ప్రసాద్, రవి, శ్రీను, గోపీ, వరలక్ష్మి, కలుగోళమ్మ, తిరుపతమ్మ, సుధాకర్, రవీంద్ర పాల్గొన్నారు.


