మహిళా ప్రజాప్రతినిధులకు గౌరవమిదేనా? | - | Sakshi
Sakshi News home page

మహిళా ప్రజాప్రతినిధులకు గౌరవమిదేనా?

Oct 2 2026 12:16 AM | Updated on Oct 2 2026 12:16 AM

● జెడ్పీ చివరి సమావేశానికి

అధికారులు రాకపోవడం దారుణం

● కాకాణి పూజిత

నెల్లూరురూరల్‌: జెడ్పీ చివరి సాధారణ సమావేశానికి అధికారులు, ప్రజాప్రతినిధులు హాజరు కాకపోవడంపై వైఎస్సార్‌సీపీ మహిళా విభాగ రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కాకాణి పూజిత ఆగ్రహం వ్యక్తం చేశారు. నెల్లూరులోని పార్టీ జిల్లా కార్యాలయంలో మహిళా నేతలతో కలిసి విలేకరుల సమావేశంలో గురువారం ఆమె మాట్లాడారు. స్థానిక సంస్థల్లో ప్రజలు ఎన్నుకున్న మహిళా ప్రజాప్రతినిధులకు కనీస గౌరవమివ్వకపోవడం బాధాకరమని చెప్పారు. జెడ్పీ చైర్‌పర్సన్‌గా ఆనం అరుణమ్మ ఐదేళ్ల కాలంలో నిబద్ధతతో పనిచేశారని కొనియాడారు. మంత్రులు, అధికార పార్టీ నేతలు రాజకీయ కారణాలతో సమావేశానికి దూరంగా ఉంటే దాన్ని వారి విజ్ఞతకే వదిలేస్తామని, అయితే కలెక్టర్‌, జెడ్పీ సీఈఓతోపాటు సంబంధిత అధికారులు సైతం రాకపోవడం తీవ్రంగా బాధించిందని తెలిపారు. మహిళా ప్రజాప్రతినిధిపై ప్రభుత్వానికి, అధికార యంత్రాంగానికి ఉన్న గౌరవం ఈ ఘటనతో స్పష్టమైందని విమర్శించారు.

మాటల్లో కాదు.. ఆచరణలో చూపండి

స్థానిక సంస్థల్లో 50 శాతం మహిళా రిజర్వేషన్ల ఉద్దేశాన్ని దెబ్బతీసేలా వ్యవహరించొద్దని పూజిత సూచించారు. మహిళా సాధికారతపై మాట్లాడే నేతలు.. క్షేత్రస్థాయిలో ప్రజల కోసం పనిచేస్తున్న మహిళలకు ప్రోత్సాహం, గౌరవమివ్వాలని కోరారు. మహిళా సాధికారతను ఆచరణలో చూపాలని హితవు పలికారు.

మంత్రి వ్యాఖ్యలకు ఖండన

సీటు వదలడం ఇష్టం లేక పదవిలో ఆనం అరుణమ్మ కొనసాగుతున్నారంటూ మంత్రి రామనారాయణరెడ్డి చేసిన వ్యాఖ్యలను పూజిత ఖండించారు. తమ ప్రభుత్వ హయాంలో టీడీపీకి చెందిన మహిళా నేతలు, మహిళా ప్రజాప్రతినిధులను అవమానించేలా మాట్లాడలేదని గుర్తుచేశారు. అధికారముందని ఏది మాట్లాడినా చెల్లుబాటవుతుందని భావించడం సరికాదని సూచించారు. రాష్ట్ర జోనల్‌ మహిళాధ్యక్షురాలు మొయిళ్ల గౌరి, జిల్లా మహిళాధ్యక్షురాలు లక్ష్మీసునంద, అంగన్‌వాడీ విభాగ రాష్ట్ర కార్యదర్శి వెంకటజ్యోతి, జిల్లా అధ్యక్షురాలు లావణ్య, జిల్లా మహిళా ఉపాధ్యక్షురాలు కృష్ణవేణి, అంగన్‌వాడీ విభాగ నెల్లూరు నగరాధ్యక్షురాలు మహేశ్వరి, నెల్లూరు రూరల్‌, సర్వేపల్లి నియోజకవర్గ మహిళాధ్యక్షులు రమాదేవి, సంధ్యారాణి, మాజీ ఎంపీపీలు సుగుణమ్మ, వజ్రమ్మ, పొదలకూరు ఎంపీటీసీ లక్ష్మీకల్యాణి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement