చిట్టమూరు: మండల పరిధిలోని మల్లాం గ్రామంలో కొలువైన వల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం వసంతోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. బుధవారం స్వామి, అమ్మవార్ల కల్యాణం నిర్వహించిన అనంతరం మరుసటి రోజు వసంతోత్సవం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఇందులో భాగంగా స్వామి, అమ్మవార్లను ప్రత్యేకంగా అలంకరించి గ్రామోత్సవం నిర్వహించారు. గ్రామంలోని చిన్నా, పెద్దా తేడా లేకుండా ఒకరిపై ఒకరు రంగులు చల్లుకున్నారు. రాత్రి ధ్వజావరోహణను నిర్వహించారు.
కాలుష్య నియంత్రణపై నిర్లక్ష్యం వద్దు
● ఏపీపీసీబీ చైర్మన్ కృష్ణయ్య
నెల్లూరు(అర్బన్): పరిశ్రమల్లో కాలుష్యాన్ని నియంత్రించాలని, నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఏపీపీసీబీ చైర్మన్, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి డా.పి.కృష్ణయ్య అన్నారు. గురువారం జిల్లాలోని పలు పరిశ్రమలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రధానంగా జీఆర్‌ఐ టవర్స్, సెంటిని పైప్స్, వయోనా ఎనర్జీ తదితర పరిశ్రమలను పరిశీలించారు. వాటిల్లో ఏర్పాటు చేసిన కాలుష్య నియంత్రణ వ్యవస్థల పనితీరును తనిఖీ చేశారు. ఘన వ్యర్థాల నిర్వహణ, గ్రీన్‌బెల్ట్ అభివృద్ధి, ఫ్యూజిటివ్ ఎమిషన్స్ నియంత్రణతోపాటు పర్యావరణ పరిరక్షణకు చేపడుతున్న చర్యలను ఆరాతీశారు. గ్రీన్‌బెల్ట్ అభివృద్ధికి సమగ్ర ప్రణాళిక రూపొందించి అమలు చేయాలని సూచించారు. తనిఖీల్లో ఎస్‌ఆర్‌ఎస్పీ జిల్లా కాలుష్య నియంత్రణ మండలి అధికారి అశోక్ తదితరులు పాల్గొన్నారు.
మద్యం అక్రమంగా తరలిస్తుండగా..
● రూ.1.50 లక్షల విలువైన బాటిళ్ల పట్టివేత
పొదలకూరు: మండలంలోని మర్రిపల్లి సమీపంలో గురువారం తెల్లవారుఝామున అక్రమంగా మద్యం తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. బెల్టుషాపులకు తీసుకెళ్తుండగా పోలీసులు పెట్రోలింగ్ చేస్తూ గుర్తించారు. ఎస్సై శివరాకేష్ ఆధ్వర్యంలో 900 బాటిళ్లు ఉన్న కేసులను స్వాధీనం చేసుకున్నట్టు తెలిసింది. వాటిని పొదలకూరు ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ శాఖకు అప్పగించారు. పంచనామా నిర్వహించి కేసు నమోదు చేస్తామని ఎకై ్సజ్ సీఐ వెంకటేశ్వర్లు వెల్లడించారు. విలువ సుమారు రూ.1.50 లక్షలు ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఏ మద్యం షాపు నుంచి బెల్టుషాపులకు తరలిస్తున్నది పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


