చిట్టమూరు: మల్లాం గ్రామంలోని వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం కల్యాణోత్సవాన్ని కనులపండువగా నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలోని నూతన కల్యాణ మండపంలో స్వామి, అమ్మవార్ల ఉత్సవ విగ్రహాలను వేంచేపు చేశారు. ఆలయ ప్రధానార్చకుడు మూలం భానుప్రకాశ్ శర్మ ఆధ్వర్యంలో వేడుకలు జరిగాయి. మండపాన్ని వివిధ రకాల పుష్పాలతో శోభాయమానంగా అలంకరించారు. భక్తులు అధిక సంఖ్యలో రావడంతో మల్లాం ప్రధాన వీధులు భక్తులతో కిక్కిరిసిపోయాయి. తమిళనాడు, హైదరాబాద్ తదితర సుదూర ప్రాంతాల నుంచి కూడా తరలివచ్చారు.
● సుబ్రహ్మణ్యేశ్వరస్వామివారి సన్నిధిలో వివాహం చేసుకుంటే శుభాలు కలుగుతాయని భక్తుల విశ్వాసం. దీంతో స్వామి కల్యాణంతోపాటు సుమారు 40 మంది నూతన వధూవరులు ఆలయ ప్రాంగణంలో వివాహాలు చేసుకున్నారు. భక్తుల రద్దీతో ఆలయ ప్రాంగణం కిక్కిరిసిపోవడంతో కొందరు ఆలయం వెలుపల కూడా వివాహాలు నిర్వహించుకున్నారు.


