● పల్లె పండగ సభకు 220 ఆర్టీసీ బస్సులు
● తీవ్ర ఇబ్బందులు పడిన ప్రయాణికులు
● ప్రైవేట్ వాహనదారుల దోపిడీ
నెల్లూరు సిటీ: కూటమి ప్రభుత్వ తీరుతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఉదయగిరి నియోజకవర్గం వరికుంటపాడు మండలం రామాపురంలో మంగళవారం పల్లె పండగ సభ జరిగింది. దీనికి జిల్లాకు చెందిన 220 ఆర్టీసీ బస్సులను అధికారులు తరలించారు. దూరప్రాంతాలకు వెళ్లేందుకు ప్రయాణికులు గంటల తరబడి బస్టాండ్లలో వేచిచూడాల్సి వచ్చింది. అరకొరగా వచ్చిన బస్సులు ఎక్కేందుకు పరుగులు పెట్టారు. ఆర్టీసీ బస్సుల రాకపోకలు లేకపోవడంతో బస్టాండ్ ఖాళీగా దర్శనమిచ్చింది. కాగా ప్రైవేట్ వాహనాలు, ఆటోలను అనేకమంది ఆశ్రయించారు. వారు దీనిని అదనుగా తీసుకుని ఎక్కువ మొత్తం డిమాండ్ చేశారు. దీంతో తప్పని పరిస్థితుల్లో అనేకమంది గమ్యస్థానాలకు వెళ్లేందుకు అధిక నగదు చెల్లించారు. ప్రభుత్వ తీరుపై ప్రయాణికులు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.


