● డీఎంహెచ్‌ఓ సుజాత
నెల్లూరు(అర్బన్): రేబిస్ వ్యాధిపై ప్రజలు అవగాహన పెంచుకుని తగిన జాగ్రత్తలు తీసుకోవాలని డీఎంహెచ్‌ఓ సుజాత సూచించారు. ప్రపంచ రేబిస్ దినోత్సవం సందర్భంగా సోమవారం నెల్లూరులోని జిల్లా వైద్యశాఖ కార్యాలయంలో అధికారులతో కలిసి వాల్‌పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రేబిస్ ప్రాణాంతక వ్యాధి అని తెలిపారు. ఇది సోకిన కుక్కలు, కోతులు, ఇతర జంతువులు కరిచినప్పుడు వ్యాధి సోకే అవకాశం ఉందన్నారు. జంతువు కరిచిన వెంటనే గాయాన్ని శుభ్రం చేసుకుని సమీపంలోని వైద్యుడిని సంప్రదించాలని సూచించారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో రేబిస్ నివారణకు అవసరమైన వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయని, కుక్కలు లేదా ఇతర జంతువులు కరిచిన వారు ఆలస్యం చేయకుండా వ్యాక్సిన్ తీసుకోవాలని తెలిపారు. కార్యక్రమంలో వ్యాధి పర్యవేక్షణ అధికారి డాక్టర్ భాస్కర్, ఎన్‌సీడీ ప్రోగ్రాం అధికారి డాక్టర్ అన్షుధర్, డెమో అధికారి కనకరత్నం తదితరులు పాల్గొన్నారు.
అడ్డగించి..
కళ్లలో కారం కొట్టి..
● రూ.3 లక్షలు దోపిడీ
మనుబోలు: కంట్లో కారంకొట్టి వైన్ షాపు క్యాషియర్ నుంచి రూ.3 లక్షలు దోచుకెళ్లిన ఘటన మండల పరిధిలోని బండేపల్లి క్రాస్ రోడ్డు సమీపంలో ఆదివారం రాత్రి జరిగింది. బాధితుడు రమేష్ సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వివరాలిలా ఉన్నాయి. కాగితాలపూరు రోడ్డు పక్కనున్న మద్యం దుకాణంలో చల్లి రమేష్ క్యాషియర్‌గా పనిచేస్తున్నాడు. రాత్రి షాపు మూసి మేనేజర్ గోపీతో కలిసి బైక్‌పై స్వగ్రామమైన మడమనూరుకు బయలుదేరాడు. బండేపల్లి క్రాస్‌రోడ్డు వద్ద నలుగురు గుర్తుతెలియని వ్యక్తులు రెండు మోటార్‌బైక్‌లపై వచ్చి వారిని అడ్డగించారు. రమేష్ కంట్లో కారం చల్లడంతో అతను పడిపోయాడు. ఆపై దాడి చేసి ఆరోజు కలెక్షన్ నగదు రూ.3 లక్షలు తీసుకుని పరారయ్యారు. బాధితుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. పోలీసులు కేసు నమోదు చేశారు.
కాలువలోకి దూసుకెళ్లిన బైక్
● వ్యక్తికి తీవ్ర గాయాలు
చిల్లకూరు: మోటార్‌బైక్‌పై వెళ్తున్న ఓ వ్యక్తి అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న కాలువలోకి దూసుకెళ్లడంతో తీవ్రంగా గాయపడిన ఘటన మండలంలోని కడివేడు – కమ్మవారిపాళెం గ్రామాల మధ్య సోమవారం చోటుచేసుకుంది. స్థానికుల వివరాల మేరకు.. కోట మండలం విద్యానగర్ ప్రాంతానికి చెందిన వెంకటయ్య బైక్‌పై గూడూరు వైపు వెళ్తున్నాడు. ఈ క్రమంలో ఏమి జరిగిందో తెలియదు కానీ బైక్ అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న కాలువలోకి దూసుకెళ్లి పడిపోయింది. అటుగా వెళ్తున్న వారు కాలువలో బైక్ ఉండటాన్ని గుర్తించారు. 108కు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న అంబులెన్స్ సిబ్బంది అతడికి ప్రథమ చికిత్స అందించారు. షాక్ నుంచి తేరుకున్న వెంకటయ్య తాను ఎక్కడ ఉన్నానని ప్రశ్నించడంతో జరిగిన విషయాన్ని వివరించారు. అనంతరం అతని బంధువుల ఫోన్ నంబర్లు తెలుసుకుని వారికి సమాచారమిచ్చారు. వెంకటయ్యను చికిత్స నిమిత్తం గూడూరు ఏరియా ఆస్పత్రికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం నెల్లూరుకు తీసుకెళ్లారు. ఈ ఘటనపై పోలీసులకు సమాచారం అందలేదు.


