● ఎన్నికల ప్రక్రియపై రౌండ్ టేబుల్ సమావేశం
నెల్లూరు(వీఆర్సీసెంటర్): దేశ ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ తన పదవికి వెంటనే రాజీనామా చేయాలని పలువురు రాజకీయ నాయకులు డిమాండ్ చేశారు. నెల్లూరులోని జెట్టి శేషారెడ్డి విజ్ఞాన కేంద్రంలో సోమవారం నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో వివిధ పార్టీల నాయకులు హాజరయ్యారు. సీపీఐ జిల్లా నాయకులు ఆంజనేయులు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో పాల్గొన్న సీపీఎం జిల్లా సెక్రటేరియట్ సభ్యుడు మోహన్‌రావు, సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ నాయకుడు రాంబాబు, సీపీఎం, సీఐటీయూ నాయకులు చండ్ర రాజగోపాల్, టీవీవీ ప్రసాద్ మాట్లాడారు. ఎస్‌ఐఆర్ ప్రక్రియను వెంటనే రద్దు చేయాలన్నారు. 18 సంవత్సరాల వయసు నిండిన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ, హోంశాఖ మంత్రి అమిత్‌షాకు తొత్తుగా వ్యవహరించి లక్షల ఓట్లను తొలగించి, ఎన్నికల ప్రక్రియను అపహాస్యం చేసేలా వ్యవహరించిన జ్ఞానేశ్ కుమార్‌కు ఎన్నికల కమిషనర్‌గా అధికారంలో ఉండే నైతిక హక్కు లేదని, వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అక్టోబర్ 2వ తేదీ వరకు జిల్లాలోని అన్ని మండలాలు, పట్టణ కేంద్రాల్లో రౌండ్‌టేబుల్ సమావేశాలు, నిరసన ప్రదర్శనలు, ధర్నాలు వంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. గాంధీ జయంతి సందర్భంగా నగరంలోని వీఆర్సీ హైస్కూల్ మైదానం నుంచి అంబేడ్కర్ విగ్రహం వరకు ప్రదర్శన నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమాల్లో ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో రైతు సంఘం, కౌలు రైతు సంఘం, సీపీఎం నాయకులు మూలి వెంగయ్య, తుళ్లూరు గోపాల్ తదితరులు పాల్గొన్నారు.


