వాకాడు: సాధారణంగా నీలిరంగులో కనిపించే సముద్రం రెండు రోజులుగా ఆకుపచ్చ ఛాయలో కనిపించడంతో తీర ప్రాంత ప్రజల్లో చర్చ జరుగుతోంది. సముద్ర స్వరూపంలో మార్పులు కనిపిస్తుండటంపై కొంత ఆందోళన కూడా వ్యక్తమవుతోంది. సాధారణంగా కెరటాలు తీరాన్ని తాకే సమయంలో తెల్లటి నురగతో ఉధృతంగా ఎగసిపడుతుంటాయి. ప్రస్తుతం అలల తాకిడి కొంత తగ్గి తీరానికి చేరువలో నీరు ఆకుపచ్చ ఛాయలో కనిపిస్తుండటంతో స్థానికుల్లో చర్చకు దారితీసింది. ఇలాంటి పరిస్థితి మునుపెన్నడూ కనిపించలేదని చెబుతున్నారు. వాతావరణ ప్రభావంతో ఇటీవల బంగాళాఖాతంలో గాలులు, అలల ఉధృతిలో మార్పులు చోటు చేసుకున్నాయి. ప్రస్తుతం ఉత్తరాంధ్ర తీరంలో సముద్ర ఉష్ణోగ్రతలకు సంబంధించి మోస్తరు స్థాయి మైరెన్ హీట్‌వేవ్ నమోదైనట్లు ఇండియన్ నేషనల్ సెంటరఫర్ ఓషన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ (ఇన్‌కాయిస్) సమాచారం పేర్కొంటోంది. ఉష్ణోగ్రతల్లో మార్పులా, సముద్రంలో భారీగా కలిసి వ్యర్థాల వల్లా.. వీటిలో ఏది కారణమో తెలియడం లేదని తీర వాసులు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు.


