దుత్తలూరు మండలంలోని ఏపీ మోడల్ స్కూల్
నెల్లూరు(పొగతోట): ప్రభుత్వ పాఠశాలల్లో ప్రహరీల నిర్మాణాలకు సంబంధించి రూ.కోట్లను స్వాహా చేసిన అధికారులపై చర్యలకు రంగం సిద్ధమైంది. ఈ వ్యవహారంలో ఆఫీసర్లు, సిబ్బందిపై క్రిమినల్ కేసులను నమోదు చేయనున్నారు. ఈ ఉదంతంపై సీరియస్‌గా ఉన్న కలెక్టర్ హిమాన్షు శుక్లా.. బాధ్యులపై చర్యలకు నోటీసులివ్వాలని ఆదేశించారని తెలుస్తోంది.
జరిగిందిదీ..
జిల్లా వ్యాప్తంగా 300 ప్రభుత్వ పాఠశాలల్లో ప్రహరీల నిర్మాణాలకు ప్రణాళికలను సమగ్ర శిక్ష అధికారులు సిద్ధం చేశారు. అయితే ఇందులోనే అక్రమాలకు తెరలేపారు. గతంలో నిర్మించిన వాటికే రెండోసారి బిల్లులను చెల్లించేలా స్కెచ్చేశారు. ఇలా రూ.15 కోట్లకుపైగా కేటాయించేలా చర్యలు చేపట్టారు. వింజమూరు, రాపూరు, మనుబోలు, దగదర్తి, ఉదయగిరి తదితర మండలాల్లో దాదాపు రూ.రెండు కోట్ల మేర బిల్లులను కాంట్రాక్టర్ల బ్యాంక్ ఖాతాల్లో జమ చేశారు. వాస్తవానికి వర్కులను సమగ్ర శిక్ష అధికారులు, ఇంజనీరింగ్ అధికారుల పర్యవేక్షణలో చేపట్టి.. ఆపై కంప్లీట్ చేయాల్సి ఉంది. రూ.24 లక్షల బిల్లుల చెల్లింపులకు సంబంధించిన ఫైల్‌ను డ్వామా పీడీ శ్రీనివాసప్రసాద్ ఆన్‌లైన్లో పరిశీలించారు. లోతుగా గమనించగా, సమగ్ర సమాచారం లేకపోవడంతో బిల్లును నిలిపేశారు. విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లగా, విచారణకు ఆదేశాలివ్వడంతో సమగ్ర శిక్ష అవినీతి బాగోతం బయటపడింది.
అంతా గందరగోళం
తొమ్మిది మండలాల్లో ప్రహరీలను నిర్మించకుండానే చెల్లింపులు చేశారు. వీటికి సంబంధించిన అంచనాలను సిద్ధం చేసి, రికార్డు చేయడం, చెక్ మెజర్మెంట్, వెండార్‌ను ఎంపిక చేయడం తదితరాలను సమగ్ర శిక్ష అధికారుల ఆధ్వర్యంలో చేపట్టారు. అయితే ఈ అంశాలను పక్కనబెట్టి డ్వామా సిబ్బందిని బాధ్యులను చేస్తున్నారు. బిల్లులను చివర్లో అప్‌లోడ్ చేసి పేమెంట్లు చేసేలా డ్వామా సిబ్బంది చర్యలు చేపట్టారు. చేసిన పొరపాటుకు సిబ్బంది నుంచి నగదును రికవరీ చేస్తున్నారు. ఇప్పటి వరకు సుమారు రూ.1.25 కోట్లను కాంట్రాక్టర్ల నుంచి రికవరీ చేశారని సమాచారం. అయితే అక్రమాలకు పాల్పడిన ప్రభుత్వోద్యోగులను రక్షించేందుకు యత్నిస్తున్నారని తెలుస్తోంది.
ప్రహరీల అక్రమాలపై
లోతుగా విచారణ
క్రిమినల్ కేసుల నమోదుకు
రంగం సిద్ధం
ఫోర్జరీ చేశారంటూ తాజాగా ప్రచారం
ఫోర్జరీ చేశారంటూ..
ఎస్టిమేషన్స్, ఎంబుక్స్ తదితరాల్లో తమ సంతకాలను ఫోర్జరీ చేశారని అధికారులు ఆరోపిస్తున్నారు. పనులు జరిగిన అన్ని మండలాల్లో ఇలా ఎలా జరిగిందో పైవాడికే ఎరుక. సమగ్ర శిక్షలో పనిచేస్తున్న అవుట్‌సోర్సింగ్ సిబ్బంది చేతివాటం ప్రదర్శించగా, దీనికి ఆ శాఖ అధికారుల సహాయ, సహకారాలు మెండుగా ఉన్నాయనే ఆరోపణలూ వినిపిస్తున్నాయి.


