● మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి
పెళ్లకూరు: అక్రమ కేసులు పెట్టి.. నెలల తరబడి జైల్లో నిర్బంధించి భయపెట్టాలనుకోవడం కూటమి నేతల మూర్ఖత్వమేనని.. జగనన్న సైన్యం బ్లడ్‌లోనే భయం లేదని మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డి స్పష్టం చేశారు. మండలంలోని చిల్లకూరులో గల పార్టీ రాష్ట్ర కార్యదర్శి కామిరెడ్డి సత్యనారాయణరెడ్డి నివాసానికి ఆదివారం వెళ్లి ఆయన సతీమణి కామిరెడ్డి ప్రభావతమ్మ, కుటుంబసభ్యులను సూళ్లూరుపేట మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్యతో కలిసి ఆదివారం పరామర్శించిన అనంతరం కాకాణి మాట్లాడారు. ఇప్పటికి సుమారు 20కుపైగా ఆక్రమ కేసులను సత్యనారాయణరెడ్డిపై పెట్టి జైలుకు మూడుసార్లు పంపడం కూటమి నియంతృత్వ పాలనకు నిదర్శనమని విమర్శించారు. అధికార పార్టీ నేతలతో కలిసి కొందరు పోలీసులు సాగిస్తున్న చట్ట వ్యతిరేక విధానాలను ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు. అధికారం ఏ ఒక్కరికీ శాశ్వతం కాదని, ఇది మారాక కూటమి నేతలతో పాటు పోలీస్ అధికారులపై చట్టపరమైన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. స్వర్ణముఖి నదిలో యంత్రాలతో ఇసుక అక్రమ తవ్వకాలను గతంలో అడ్డుకున్నందుకు గానూ సత్యనారాయణరెడ్డిని 97 రోజులు జైల్లో పెట్టి పైశాచికానందాన్ని పొందిన అంశాన్ని గుర్తుచేశారు. తాజాగా ఇప్పుడు వ్యవసాయ భూముల్లో పనులు చేసుకుంటుండగా టీడీపీ రౌడీమూకలెళ్లి అడ్డుకొని పోలీసుల సాక్షిగా దాడులకు పాల్పడ్డారని ఆరోపించారు. ఇదే సమయంలో ఘటన స్థలానికి వెళ్తున్న ఓ టీడీపీ కార్యకర్త.. పోలీసులు, రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు చూస్తుండగానే అనారోగ్య సమస్యతో కుప్పకూలి మృతి చెందారని, అయితే దాన్నీ రాజకీయం చేస్తూ.. తప్పుడు కేసులను నమోదు చేసి సత్యనారాయణరెడ్డిని మళ్లీ జైలుకు పంపడం దుర్మార్గమన్నారు. అక్రమ కేసులకు సత్యనారాయణరెడ్డి భయపడే రకం కాదని చెప్పారు.
ఖాకీల తీరుపై ఆగ్రహం
అధికార పార్టీ నేతల ఒత్తిళ్లతో సత్యనారాయణరెడ్డిపై పోలీస్ యంత్రాంగం అక్రమ కేసులు పెట్టడం, పలుమార్లు అరెస్ట్ చేసి జైలుకు పంపడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వమెన్ని కేసులు పెట్టినా చట్టపరంగా పోరాటం చేస్తామని చెప్పారు. అధికార పార్టీ నేతలు సాగిస్తున్న అన్యాయాలను ప్రశ్నించే గొంతులను పోలీసుల ద్వారా నొక్కేయాలనుకోవడాన్ని పనికిమాలిన చర్యగా అభివర్ణించారు. సత్యనారాయణరెడ్డి, ఆయన కుటుంబానికి తమ పార్టీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డితో పాటు పార్టీ మొత్తం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు మద్దాల సోమశేఖర్‌రెడ్డి, మాజీ జెడ్పీటీసీ ప్రిస్కిల్లా, పార్టీ మండలాధ్యక్షుడు వెంకటరత్నం, సుబ్రహ్మణ్యంరెడ్డి, నేతలు మోహన్, జనార్దన్‌రెడ్డి, పట్టాభిరెడ్డి, కిశోర్‌యాదవ్, గిరిరెడ్డి, వెంకటరాఘవరెడ్డి, రఘునాయుడు తదితరులు పాల్గొన్నారు.


