● చుక్కలనంటుతున్న
నిత్యావసర సరుకుల ధరలు
● బెంబేలెత్తుతున్న వినియోగదారులు
● పెళ్లిళ్ల సీజన్లో ఖర్చులు తడిచిమోపెడు
పొదలకూరు: నిత్యావసర సరుకుల ధరలు నానాటికీ ఎగబాకుతున్నాయి. కొనబోతే కొరివి.. అమ్మబోతే అడవి అనే చందంగా పరిస్థితి మారుతోంది. దీనికి తోడు గోరుచుట్టుపై రోకటిపోటులా కూరగాయల ధరలు దిగిరావడం లేదు. ఫలితంగా ఏం కొనలేం.. ఏం తినలేం అనే పరిస్థితికి సామాన్యులొస్తున్నారు.
అన్నీ ౖపైపెకి..
పశ్చిమాసియాలో యుద్ధమంటూ వంట నూనైపె దిగుమతి సుంకాన్ని అమాంతం పెంచడంతో నిత్యం వినియోగించే నూనె ప్యాకెట్ల ధరలకు రెక్కలొచ్చాయి. బియ్యం క్వింటాల్‌కు రూ.300 నుంచి రూ.500 వరకు పెరిగింది. కందిపప్పు రూ.150 నుంచి రూ.185కు.. పెసరపప్పు రూ.120 నుంచి రూ.130కు.. మినపప్పు రూ.100 నుంచి రూ.125కు.. ఉల్లి ధరలు రూ.70 వరకు అమ్ముతున్నారు. వెల్లుల్లి కిలో రూ.300.. ఎండు మిర్చి రూ.400 పలుకుతోంది. బెల్లం రూ.60 నుంచి రూ.100కు ఎగబాకింది.
రేట్లు పెంచేసిన కేటరింగ్ నిర్వాహకులు
శుభముహూర్తాలొస్తున్న నేపథ్యంలో అక్టోబర్‌లో వివాహాలు ఎక్కువగా ఉన్నాయి. దీంతో మధ్య తరగతి వారిలో టెన్షన్ మొదలైంది. పెళ్లిళ్ల సందర్భంగా బంధుమిత్రులకు భోజనాల ఏర్పాటులో నిత్యవసర సరుకులే కీలకం. ఈ తరుణంలో భోజనాల రేట్లను కేటరింగ్ నిర్వాహకులు సైతం పెంచేశారు. గ్రామీణ ప్రాంతాలు, పట్టణాల్లో కేటరింగ్ నిర్వహించే వారు ఇప్పటి వరకు మనిషికి రూ.125 నుంచి రూ.130 వరకు వసూలు చేసేవారు. అయితే ప్రస్తుతం దీన్ని రూ.150కు పెంచేశారు. ధరలు దిగొస్తేనే మధ్యతరగతి వారు ఊపిరి పీల్చుకునే అవకాశముంది. మరోవైపు హోటళ్ల నిర్వాహకులు సైతం భోజనాల ధరలను పెంచేసి ఆ మేరకు బోర్డులను ఏర్పాటు చేస్తున్నారు.


