● శ్రావణ్ అరెస్ట్‌పై భార్య, తల్లి ఆవేదన
నెల్లూరు రూరల్: పేద బ్రాహ్మణులపై కక్షసాధింపు చర్యలకు పాల్పడటం తగదని ఫోర్త్ ఎస్టేట్ ఛానల్ సీఈఓ, వైఎస్సార్ విద్యార్థి విభాగ మాజీ జిల్లా అధ్యక్షుడు గొల్లపూడి శ్రావణ్‌కుమార్ తల్లి జయశ్రీ పేర్కొన్నారు. నగరంలోని జర్నలిస్ట్ భవన్‌లో ఆదివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో భార్య షర్మిల, తల్లి జయశ్రీ కన్నీటి పర్యంతమయ్యారు. తన భర్తపై ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని షర్మిల ఆరోపించారు. ఒక కేసులో బెయిలొచ్చే సమయంలో, మరో కేసును నమోదు చేస్తూ ఇబ్బందులు పెడుతున్నారని చెప్పారు. ఎలాంటి తప్పూ చేయకపోయినా తన భర్తను జైలుకు పంపారని ఆవేదన వ్యక్తం చేశారు. తమ కుమారుడికి పుట్టు వెంట్రుకలు తీయించే సమయంలో శ్రావణ్‌ను అరెస్ట్ చేయడంతో తండ్రి లేకుండానే కార్యక్రమాన్ని నిర్వహించాల్సి వచ్చిందన్నారు. తండ్రి కోసం పిల్లలు ఎదురుచూస్తున్నారని, వీరి పరిస్థితిని చూసైనా విడుదల చేయాలని కోరారు. అనంతరం జయశ్రీ మాట్లాడారు. శ్రావణ్‌పై ఆధారపడి తాము జీవిస్తున్నామని తెలిపారు. తన కుమారుడు భోజనం చేస్తుంటే మధ్యలో తీసుకెళ్లడం మహాపాపమన్నారు. డబ్బులకు ఆశపడే వ్యక్తి శ్రావణ్ కాదని, ఆయన్ను విడుదల చేయాలని వేడుకున్నారు.


