పిల్లల ఆరోగ్యం అందరి బాధ్యత | - | Sakshi
Sakshi News home page

పిల్లల ఆరోగ్యం అందరి బాధ్యత

Sep 26 2026 12:20 AM | Updated on Sep 26 2026 12:20 AM

● డీఎంహెచ్‌ఓ సుజాత

● 4.97 లక్షల మంది పిల్లలకు

ఆల్‌బెండజోల్‌ మాత్రలు

నెల్లూరు(అర్బన్‌): పిల్లల ఆరోగ్యం అందరి బాధ్యత అని నెల్లూరు మేయర్‌ దేవరకొండ సుజాత, డీఎంహెచ్‌ఓ సుజాత పేర్కొన్నారు. జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం జిల్లాలోని పాఠశాలలు, కళాశాలలు, అంగన్‌వాడీ కేంద్రాల్లో కార్యక్రమాలు నిర్వహించారు. ఇందులో భాగంగా 1 నుంచి 19 ఏళ్లలోపు పిల్లలకు ఆల్‌బెండజోల్‌ మాత్రలను పంపిణీ చేసి మింగించారు. నెల్లూరులోని మూలాపేట డీఎస్‌ఆర్‌ ప్రభుత్వ హైస్కూల్లో నిర్వహించిన కార్యక్రమాన్ని మేయర్‌, డీఎంహెచ్‌ఓ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నులిపురుగుల నివారణతో పిల్లల్లో జీర్ణశక్తి మెరుగుపడటంతోపాటు ఉత్సాహంగా ఉండేందుకు, చదువులో రాణించేందుకు దోహదపడుతుందన్నారు. నులిపురుగుల కారణంగా రక్తహీనత, పోషకాహార లోపం ఏర్పడి పిల్లలు నీరసంగా మారే అవకాశం ఉందన్నారు.

93.25 శాతం లక్ష్యం పూర్తి

జిల్లాలో 1 నుంచి 19 ఏళ్లలోపు 5,33,793 మంది పిల్లలు ఉండగా, వారిలో 4,97,762 మందికి తొలిరోజు మాత్రలు పంపిణీ చేసినట్లు డీఎంహెచ్‌ఓ తెలిపారు. దీంతో 93.25 శాతం లక్ష్యం పూర్తయిందన్నారు. శనివారం మిగిలిన పిల్లలకు కూడా మాత్రలు మింగించి వందశాతం లక్ష్యాన్ని సాధిస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర పరిశీలకుడు, జాయింట్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ శ్రీనివాసవర్మ, ఐసీడీఎస్‌ పీడీ శైలజ, ఎన్‌సీడీ ప్రోగ్రామ్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ అన్శుదర్‌, రాష్ట్ర కన్సల్టెంట్‌ రామ్మోహన్‌, డెమో అధికారి కనకరత్నం, జిల్లా ఫ్లోరోసిస్‌ కన్సల్టెంట్‌ డాక్టర్‌ దివ్య, పాఠశాల హెచ్‌ఎం పద్మావతి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement