● పేదలపై రెవెన్యూ అధికారుల ప్రతాపం
చిల్లకూరు: చెరువు పోరంబోకు భూమిలో ఎన్నో సంవత్సరాలుగా పేదలు మామిడి, కొబ్బరి చెట్లు సాగు చేసుకుంటుండగా ఆక్రమించారంటూ రెవెన్యూ అధికారులు రెచ్చిపోయారు. శుక్రవారం చెట్లు తొలగించారు. మండలంలోని బూదనంలో దళితులు కొన్ని సంవత్సరాలుగా గ్రామ చెరువు పోరంబోకు భూమిలో గడ్డి వాములు వేసుకోవడం, పండ్ల మొక్కల సాగు చేపట్టారు. ఇటీవల చెరువుకు దగ్గరగా గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు ఓ పరిశ్రమను ఏర్పాటు చేస్తున్నాడు. అతను రెవెన్యూ అధికారులపై ఒత్తిడి తెచ్చాడు. పరిశ్రమకు చెందిన ఫెన్సింగ్ చెరువు పోరంబోకు భూమిలోకి వస్తున్నప్పటికీ దానిని పట్టించుకోలేదు. దీనిపై దళితులు అధికారులను ప్రశ్నిస్తే మాకు తెలుసంటూ చెట్లను తొలగించారు. ఇలా గతంలో కూడా ఓ పర్యాయం చెట్ల తొలగింపునకు చర్యలు చేపట్టే సమయంలో దళితులు లోక్ అదాలత్‌లో ఫిర్యాదు చేయగా విచారణ జరుగుతోంది. అయినప్పటికీ రెవెన్యూ అధికారులు టీడీపీ నాయకుడికి ఇబ్బంది కలగకూడదని ఆక్రమణలను తొలగిస్తున్నామని యంత్రాలతో చెట్లను పూర్తిగా తొలగించారు. బాధితులు గూడూరులోని ఆర్డీఓ అరుణకుమారిని కలిసి తమ గోడు చెప్పుకొంటే ఆమె రెవెన్యూ అధికారులను ఫోన్‌లో మందలించినప్పటికీ తమ పని తాము చేసేదే అనే రీతిలో వ్యవహరించారు.


