అధికార పార్టీకి రబ్బర్‌ స్టాంప్‌గా కమిషనర్‌ | - | Sakshi
Sakshi News home page

అధికార పార్టీకి రబ్బర్‌ స్టాంప్‌గా కమిషనర్‌

Sep 25 2026 12:47 AM | Updated on Sep 25 2026 12:47 AM

నెల్లూరు (బారకాసు): నెల్లూరు నగర కార్పొరేషన్‌ ఎన్నికల్లో అధికార పార్టీకి తొత్తుగా కమిషనర్‌ రబ్బర్‌ స్టాంప్‌గా వ్యవహరిస్తున్నారని ఎమ్మెల్సీ, వైఎస్సార్‌సీపీ నెల్లూరు సిటీ నియోజకవర్గ ఇన్‌చార్జి పర్వతరెడ్డి చంద్రశేఖర్‌ రెడ్డి ఆరోపించారు. గురువారం వైఎస్సార్‌సీపీ కార్పొరేటర్లు, పార్టీకి చెందిన పలు డివిజన్ల ఇన్‌చార్జిలతో కలిసి ఎన్‌ఎంసీ కార్యాలయంలోని కమిషనర్‌ నందన్‌ను ఎమ్మెల్సీ పర్వతరెడ్డి పలు అభ్యంతరాలను తెలియజేశారు. అధికార పార్టీ నేతలు డివిజన్లలో అభ్యర్థుల రిజర్వేషన్‌కు సంబంధించి లీకులిస్తూ ప్రజలను గందరగోళానికి గురి చేస్తున్నారన్న విషయంపై ఎమ్మెల్సీ నిలదీశారు. ఎన్నికలకు సంబంధించి కొన్ని ముఖ్యమైన సమాచారాలను ప్రతిపక్ష వైఎస్సార్‌సీపీకి చేరకముందే.. కొన్ని వాట్సాప్‌ గ్రూపుల్లో సర్కులేట్‌ అవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం ఎమ్మెల్సీ మీడియాతో మాట్లాడుతూ కమిషనర్‌ అధికార పార్టీకి అడ్డగోలుగా పని చేస్తున్నారని ఆరోపించారు. డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ రచించిన రాజ్యాంగ విలువలను అపహాస్యం చేసేలా కూటమి పార్టీల నేతలు సీట్ల రిజర్వేషన్స్‌కు సంబంధించి గందరగోళానికి గురి చేస్తున్నారన్నారు. ఇప్పటి వరకు కార్పొరేషన్‌లోనే ఏ డివిజన్‌కు ఏ రిజర్వేషన్‌ వస్తుందనే ప్రాథమిక సమాచారం లేదని, అక్టోబర్‌ మొదటి వారంలో రిజర్వేషన్లు ఖరారయ్యే అవకాశం ఉందన్నారు. కార్పొరేషన్‌కు సంబంధించి అనేక అంశాలపై కమిషనర్‌ని అడిగినప్పుడు సమాచారాన్ని దాటవేస్తున్న తీరు తీవ్ర అభ్యంతరకరమన్నారు. నామినేషన్ల విషయంలో కూడా ప్రతిపక్ష పార్టీ నేతలను బెదిరించి, దాడులు చేయించి నామినేషన్‌ విత్‌ డ్రా చేయించే దిశగా అధికార పార్టీ దుర్మార్గాలకు పాల్పడే ఆలోచన చేస్తున్నట్లు అర్థమవుతుందన్నారు. అలాంటి చర్యలకు అధికార పార్టీ పాల్పడితే ఏ మాత్రం ఉపేక్షించబోమన్నారు. ప్రజల్లో మార్పు వచ్చిందని, కచ్చితంగా కూటమి పార్టీలకు తగిన బుద్ధి చెబుతారన్నారు. ప్రజలు ఒకటే నిర్ణయించుకొని ఉన్నారని, ఈ వెన్నుపోటు పార్టీని ఎప్పుడు తరిమికొట్టాలా మళ్లీ ఈ రాష్ట్రానికి జగన్‌మోహన్‌రెడ్డిని ముఖ్యమంత్రిగా చేసుకోవాలన్న దృఢ సంకల్పంతో ప్రజలు ఉన్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు వైఎస్సార్‌సీపీ కార్పొరేటర్లు, పార్టీ నాయకులు కార్యకర్తలు, పాల్గొన్నారు.

మండిపడ్డ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి

చంద్రశేఖర్‌రెడ్డి

రిజర్వేషన్లపై గందరగోళానికి గురిచేస్తున్న అధికార పార్టీ నేతలు

పలు అభ్యంతరాలపై వైఎస్సార్‌సీపీ కార్పొరేటర్లు, పార్టీ డివిజన్‌ ఇన్‌చార్జిలతో కలిసి ఫిర్యాదు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement