వైభవంగా ధ్వజారోహణం | - | Sakshi
Sakshi News home page

వైభవంగా ధ్వజారోహణం

Sep 22 2026 11:43 PM | Updated on Sep 22 2026 11:43 PM

చిట్టమూరు: మండలంలోని మల్లాంలో కొలువైన వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం ధ్వజారోహణ కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. ఆలయ అర్చకులు ధ్వజస్తంభం వద్ద మయూర ఆగమశాస్త్ర ప్రకారం ప్రత్యేక పూజలు నిర్వహించి బ్రహ్మోత్సవాలకు ముక్కోటి దేవతలను ఆహ్వానిస్తూ ధ్వజాన్ని ఎగురవేశారు. అనంతరం సంతానం లేని మహిళలకు కొడిముద్దల ప్రసాదాన్ని పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి చెన్నారెడ్డి చెంచురాఘవరెడ్డి ఉభయకర్తగా వ్యవహరించారు.

కళ్లకు గంతలతో

వీఆర్‌ఏల నిరసన

సంగం: తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సంగం తహసీల్దార్‌ కార్యాలయం వద్ద వీఆర్‌ఏలు వారం రోజులుగా ధర్నాను కొనసాగిస్తున్నారు. అయినా ప్రభుత్వం పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడంతో మంగళవారం కళ్లకు గంతలు కట్టుకుని వినూత్నంగా నిరసన తెలిపారు. తమ సమస్యలను పరిష్కరించే వరకు ఆందోళనను కొనసాగిస్తామని వారు స్పష్టం చేశారు.

భూ కబ్జాపై

ఉన్నతాధికారుల ఆరా

వెంకటాచలం: మండలంలోని కసుమూరులోని సర్వే నంబరు 118–1లోని 1.66 ఎకరాలు, 118–2లోని 0.25 సెంట్ల ప్రభుత్వ, దేవాలయ భూముల కబ్జాపై ‘సాక్షి’లో ‘కన్నేశారు..కబ్జా చేశారు’ శీర్షికన మంగళవారం కథనం ప్రచురితమైన విషయం తెలిసిందే. రూ.20 కోట్ల విలువ భూముల కబ్జాపై జిల్లా ఉన్నతాధికారులు స్పందించి మండల రెవెన్యూ అధికారులను ఆరా తీశారు. క్షేత్రస్థాయిలో సమగ్ర విచారణ జరిపి నివేదిక పంపాలని ఆదేశించినట్లు సమాచారం.

మూడు డైరెక్టర్ల

స్థానాలు ఏకగ్రీవం

నెల్లూరు(వేదాయపాళెం): జిల్లా పాల ఉత్పత్తిదారుల పరస్పర సహాయ సహకార సమితిలో రొటేషన్‌ పద్ధతిలో ఖాళీ అయిన మూడు డైరెక్టర్‌ స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. డైరెక్టర్ల స్థానాల భర్తీకి సోమవారం నామినేషన్లు స్వీకరించగా రెండు స్థానాలకు రెండేసి, ఒక స్థానానికి ఒకటి చొప్పున ఐదు నామినేషన్లు దాఖలయ్యాయి. మంగళవారం ఉపసంహరణ గడువు ముగిసే సమయానికి ఇద్దరు అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. దీంతో మూడు డైరెక్టర్‌ స్థానాలకు మూడు నామినేషన్లు మాత్రమే మిగలడంతో ఏకగ్రీవంగా ఎన్నిక జరిగినట్లు ఎన్నికల అధికారి బీ హరిబాబు ప్రకటించారు. కాగా ఏకగ్రీవంగా ఎన్నికై న డైరెక్టర్లు అక్టోబర్‌ 1న బాధ్యతలు స్వీకరించనున్నారు.

వృద్ధురాలిపై లైంగిక దాడి కేసులో వ్యక్తికి పదేళ్ల జైలు

నెల్లూరు (లీగల్‌): 98 ఏళ్ల వృద్ధురాలిపై మద్యం మత్తులో లైంగికదాడికి పాల్పడినట్లు నమోదైన కేసులో నెల్లూరుకు చెందిన వల్లూరు పెంచలయ్య అలియాస్‌ గుణ (19)కు పదేళ్ల కఠిన కారాగార శిక్ష, రూ.1,000 జరిమానా విధిస్తూ 8వ అదనపు జిల్లా కోర్టు న్యాయమూర్తి ఏఎన్‌ శైలజ మంగళవారం తీర్పు చెప్పారు. వివరాలు..నెల్లూరులోని సుందరయ్యనగర్‌, పొర్లుకట్ట ప్రాంతంలో మంచానికి పరిమితమైన 98 ఏళ్ల వృద్ధురాలు ఒంటరిగా గుడిసెలో ఉంటోంది. అదే ప్రాంతనికి పెంచలయ్య 2017 ఆగస్ట్‌ 26 వేకువజామున 3 గంటల సమయంలో వృద్ధురాలి గుడిసెలోకి ప్రవేశించి ఆమెను చంపుతానని బెదిరించి లైంగికదాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనపై పరువు మర్యాదలకు భయపడిన వృద్ధురాలి బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. అయితే వృద్ధురాలు అధిక రక్తస్రావంతో బాధ పడుతుండగా బంధువులు ఆమెను నెల్లూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి అందిన సమాచారం, బాధితురాలి వాంగ్మూలం మేరకు సంతపేట పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడ్ని అరెస్ట్‌ చేసి కోర్టులో చార్జిషీట్‌ దాఖలు చేశారు. కోర్టులో నేరం రుజువు కావడంతో నిందితుడికి పై మేరకు శిక్ష, జరిమానా విధిస్తూ న్యాయమూర్తి తీర్పు చెప్పారు. ప్రాసిక్యూషన్‌ తరుపున పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ బీ బ్రహ్మయ్య కేసు వాదించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement