● పొగాకు బోర్డు ఆర్‌ఎం జీఎల్‌కే ప్రసాద్
మర్రిపాడు: పొగాకు రైతులు సాగు విస్తీర్ణాన్ని క్రమంగా తగ్గించుకుని ప్రత్యామ్నాయ పంటల సాగుపై దృష్టి సారించాలని పొగాకు బోర్డు రీజినల్ మేనేజర్ జీఎల్‌కే ప్రసాద్ సూచించారు. డీసీపల్లి పొగాకు బోర్డులో పొగాకు రైతులకు ప్రత్యామ్నాయ పంటల సాగుపై మంగళవారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్‌ఎం మాట్లాడుతూ వచ్చే ఏడాది పొగాకు డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని ఒక బ్యారెన్‌కు 21 క్వింటాళ్ల ఉత్పత్తికి మాత్రమే అనుమతి ఇవ్వనున్నట్లు తెలిపారు. రైతులు డిమాండ్‌కు మించి ఉత్పత్తి చేస్తే మార్కెట్‌లో తగిన ధర లభించక నష్టపోయే అవకాశం ఉందన్నారు. నెల్లూరు కేవీకే శాస్త్రవేత్త కిరణ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ నేల స్వభావం, నీటి వసతి, మార్కెట్ డిమాండ్‌ను పరిగణనలోకి మిరప, కంది,పెసర, మినుము, ఉలవ, అలసంద, వేరుశనగ, పొద్దుతిరుగుడు, నువ్వులు, రాగి, జొన్న, మొక్కజొన్న, ధనియాలు తదితర ప్రత్యామ్నా య పంటలను సాగు చేసుకోవాలని సూచించారు. నవంబరు మొదటి వారం జొన్న పంట సాగుకు అనుకూలమని, నంద్యాల తెల్లజొన్న 5 రకాన్ని సాగుచేస్తే ఎకరాకు 20 నుంచి 30 క్వింటాళ్ల వరకు దిగుబడులు వచ్చే అవకాశం ఉందని తెలిపారు. ఉద్యాన శాఖ అధికారి రాజశేఖర్ పండ్ల తోటలు, కూరగాయలు, ఆయిల్‌పామ్ సాగుకు ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీలపై అవగాహన కల్పించారు. ఆక్షన్ సూపరింటెండెంట్ జీ రాజశేఖర్, పొగాకు బోర్డు వేలం నిర్వహణాధికారి చంద్రశేఖర్ పాల్గొన్నారు.


