రైల్వేస్టేషన్ (విజయవాడ పశ్చిమ): దక్షిణ కోస్తా రైల్వే ప్రిన్సిపల్ చీఫ్ ఆపరేషన్స్ మేనేజర్ (పీసీఓఎం) వినీత్‌కుమార్ శనివారం కృష్ణపట్నం పోర్టుతో పాటు పలు రైల్వేస్టేషన్లలో విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. తొలుత పోర్టులో మౌలిక సదుపాయాలు, భద్రతా చర్యలు, సరుకు రవాణా సామర్థ్యాన్ని పెంచే వ్యూహాలపై అదానీ కృష్ణపట్నం పోర్టు లిమిటెడ్ సీఈఓ జగదీష్ పటేల్‌తో సమీక్షించారు. ఒక్కొక్క నౌకలో లక్ష టన్నులకు పైగా సరుకు రవాణా చేసేందుకు ఏర్పాటు చేసిన అదనపు మెకనైజ్డ్ బెర్త్‌ను పరిశీలించారు. అనంతరం మనుబోలు, కృష్ణపట్నం, నిడుగుంటపాళెం, రావూరు రైల్వేస్టేషన్లతో పాటు గూడ్స్ షెడ్‌లను క్షేత్రస్థాయిలో తనిఖీ చేశారు. ఈ తనిఖీల్లో పీసీఓఎంతో పాటు సీనియర్ డీఓఎం ఎ.సురేష్‌రెడ్డి, డీసీఎం జి.మోహనకృష్ణ పాల్గొన్నారు.


