ప్రభుత్వ శాఖల్లో అక్రమాలు | - | Sakshi
Sakshi News home page

ప్రభుత్వ శాఖల్లో అక్రమాలు

Aug 19 2026 12:00 AM | Updated on Aug 19 2026 12:00 AM

చేవ కోల్పోయిన విజిలెన్స్‌, ఏసీబీ శాఖలు

జిల్లాలో పాలన గాడి తప్పింది. తమ అధీనంలోని శాఖలపై ఉన్నతాధికార యంత్రాంగం పట్టుకోల్పోయింది. చక్కదిద్దాల్సిన సర్వాధికారాలు కలిగిన పరిపాలన సర్వోన్నతాధికారి చేతులెత్తేశారు. ప్రత్యేక డైవర్షన్‌ కార్యక్రమాలతో ప్రజా విశ్వసనీయతను కోల్పోతున్నారు. ప్రతి శాఖలో అవినీతి జడలు విప్పి.. బుసలు కొడుతున్నా.. కట్టడి చేయలేని దైన్య పరిస్థితిలో మిగిలిపోతున్నారు. జిల్లాలో అత్యధికంగా రెవెన్యూ పరమైన వివాదాలు, సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నా.. పరిష్కరించే అధికారాలు తన చేతిలో ఉన్నా.. ఏమీ చేయలేని అసహాయ స్థితిలో ఉన్నారనే విమర్శలను మూటగట్టుకుంటున్నారు. సహజ వనరుల దోపిడీ నుంచి ప్రభుత్వ శాఖల్లో ఫైళ్ల కదలిక వరకు.. ప్రతిదానికి ‘రేటు’ నిర్ణయిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

సాక్షిప్రతినిధి, నెల్లూరు: జిల్లాలో పరిపాలన అధికార వ్యవస్థల నుంచి రాజకీయ వ్యవస్థల చేతుల్లోకి వెళ్లిపోయింది. స్థానిక ఎమ్మెల్యేల కనుసన్నల్లో పనిచేస్తుండడంతో అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిన్నారు. పాలనపై కలెక్టర్‌ సైతం పట్టు సాధించలేకపోవడంతో పారదర్శకత లోపించింది. గ్రామ రెవెన్యూ అధికారి నుంచి డీఆర్వో వరకు.. పంచాయతీ సెక్రటరీ నుంచి జెడ్పీ సీఈఓ వరకు.. గ్రామ వ్యవసాయశాఖాధికారి నుంచి జిల్లా వ్యవసాయశాఖాధికారి వరకు.. సివిల్‌ సప్లయీస్‌ డీటీ నుంచి డీఎస్‌ఓ వరకు.. పీహెచ్‌సీ డాక్టర్‌ నుంచి డీఎంహెచ్‌ఓ వరకు.. ఇక ఇంజినీరింగ్‌ శాఖల్లో ఇరిగేషన్‌, హౌసింగ్‌, పీఆర్‌, ఆర్‌అండ్‌బీల ఏఈల నుంచి ఎస్‌ఈల వరకు.. డీఆర్‌డీఏ, డ్వామా తదితర శాఖల్లో కింది స్థాయి ఉద్యోగులపై పైస్థాయి అధికారులకు పట్టుకోల్పోయారు. పోలీస్‌, ఎకై ్సజ్‌, విజిలెన్స్‌, ఏసీబీ, నిఘా వ్యవస్థలన్నీ అధికార పార్టీ నేతల గుప్పెట్లో ఉండి తోలుబొమ్మల్లా ఆడుతున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

జిల్లా పాలన పడకేస్తే.. అవినీతి వేళ్లూనుకుపోయింది. ప్రభుత్వ శాఖలపై పాలనా యంత్రాంగం పర్యవేక్షణ కొరవడడంతో కిందిస్థాయి అధికారులు, ఉద్యోగులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పాలనను గాడిలో పెట్టాల్సిన సర్వోన్నత అధికారి సైతం సమస్యల పరిష్కారంలో చొరవ చూపడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రత్యేక డైవర్షన్‌ కార్యక్రమాలు, ఆర్భాటపు పర్యటనలతో ప్రజలకు చేరువ కావాలనే ప్రయత్నం చేస్తున్నప్పటికీ.. క్షేత్రస్థాయిలో మాత్రం పాలనపై నమ్మకం సన్నగిల్లుతోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

అవినీతి, అశ్రితపక్ష పాలనతో జనం విలవిల

జిల్లాలో జడలు విప్పి బుసలు కొడుతున్న అవినీతి, రాజకీయ పక్షపాతంతో సాగుతున్న అశ్రిత పక్ష పాలనతో జిల్లా ప్రజలు విలవిలలాడుతున్నారు. అధికార పార్టీని అడ్డం పెట్టుకుని దోచుకునే రెండు శాతం వారు తప్ప.. మిగతా 98 శాతం ప్రజలు ఈ దుష్టపాలనతో విసిగివేశారిపోతున్నారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో దాదాపు 32 పథకాల ద్వారా ప్రతి పేద కుటుంబానికి సంక్షేమ పథకాలు అందించడంతో ప్రజలు సుభిక్షంగా ఉన్నారు.

సహజవనరుల దోపిడీ

నియోజకవర్గాల్లో సహజ వనరులు దోపిడీ చేస్తున్నా ఉన్నతాధికారులు కళ్లప్పగించి చూస్తున్నారే తప్పా.. అడ్డుకట్టకు చర్యలు చేపట్టడం లేదు. ఉన్నతాధికారులే మౌనం దాల్చడంతో కింది స్థాయి అధికారులు, ఉద్యోగులు ఇష్టారాజ్యంగా మసలుకుంటున్నారు. ఉచిత ఇసుక పేరుతో జిల్లాలో రెండేళ్లుగా దోపిడీ చేస్తున్నారు. పెన్నానదిలో అక్టోబర్‌ 15 వరకు ఇసుక తవ్వకాలు చేయొద్దని నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యునల్‌ ఆదేశాలు ఉన్నాయి. ఈ రెండేళ్లుగా నదిలో ఇసుక తవ్వకాలకు పర్యావరణ శాఖ అనుమతి లేకుండానే విచ్చలవిడిగా ఇసుక తవ్వకాలు, అక్రమ రవాణా చేపట్టినా.. అధికార యంత్రాంగం కళ్లప్పగించి చూస్తున్నాయి. జిల్లాలో పగలు, రాత్రి తేడా లేకుండా పడమటి కంభంపాడు,. ముదివర్తి, మినగల్లు, పెరుమాళ్లపాడు నెల్లూరు నగరంలో అన్ని రీచ్‌ల్లో యంత్రాలు పెట్టి ఇసుకను అక్రమంగా రవాణా సాగిస్తున్నారు. ఈ విషయం జిల్లా అధికార యంత్రాంగానికి అందరికీ తెలిసిన విషయమే. కానీ ఎవరూ ఆపే సాహసం చేయరు.

రేషన్‌ దందాకు సహకారం

జిల్లాలో ప్రతి నియోజక వర్గంలో స్థానిక షాడో ఎమ్మెల్యేల కనుసన్నల్లో రేషన్‌ దందా నడిపిస్తున్నారు. నెల్లూరుకు చెందిన ఓ రేషన్‌ మాఫియా నేత ఆధ్వర్యంలో నియోజకవర్గం ఒక్కొక్కరికి పంచేశారు. ప్రతి నెలా రూ.లక్షల్లో లోకల్‌ షాడో లకు కప్పం కడుతూ రేషన్‌ బియ్యం నెల్లూరుకు తరలించి .. మిల్లులో పాలిష్‌ చేసి తిరిగి మార్కెట్‌లోకి పంపుతున్నారు.

వ్యవస్థలపై

పట్టుకోల్పోయిన అధికారులు

ప్రతి శాఖలో జడలు విప్పుతున్న అవినీతి

ఊరూరా అధికార పార్టీ నేతల భూ ఆక్రమణలు

పేదలకు అందని రేషన్‌ బియ్యం

ఉచిత ఇసుక పేరుతో విచ్చలవిడిగా అక్రమ రవాణా

ఇరిగేషన్‌ శాఖలో టెండర్లు ఓపెన్‌ చేయకుండానే పనులు పూర్తి

రీ సర్వే పేరుతో కొత్తగా

భూ వివాదాల సృష్టి

ఎమ్మెల్యేలు, మంత్రులు చెప్పారని అడ్డగోలు విజిలెన్స్‌ విచారణలు

ఇరిగేషన్‌ శాఖలో అవినీతి..

ఇరిగేషన్‌ శాఖలో అధికారులు బరితెగించారు. లోకల్‌ ఎమ్మెల్యేలు చెప్పిందే వేదంగా భావించి నిధులు స్వాహా పర్వానికి గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చేశారు. సర్వేపల్లిలో కాలువల పూడిక తీత పనులు కోసం టెండర్ల దశలో ఉండగానే పనులు తూతూ మంత్రంగా కానిచ్చేసి బిల్లులు పెట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. సర్వేపల్లి, కోవూరులో , ఉదయగిరి, ఆత్మకూరు , నెల్లూరు రూరల్‌ అన్ని నియోజకవర్గాల్లో అధికారులు బరితెగించి అక్రమాలు ప్రోత్సహిస్తున్నారని తెలిసినా కూడా ఉన్నతాఽధికారులు మౌనం దాల్చారు.

ప్రభుత్వ శాఖల్లో అవినీతి పొంగి పొర్లుతుంది. ఇటీవల సమగ్రశిక్ష అభియాన్‌లో చిరుద్యోగులు, అధికారులతో కుమ్మకై ్క రూ.20 కోట్ల స్వాహా పర్వానికి తెరలేపిన సంగతి వెలుగులోకి వచ్చింది. ఉపాధి హామీ పథకంలో పనులు చేయకుండానే బిల్లులు డ్రా చేయడం, టీడీపీ నేతలే కూలీలుగా మారి నగదు డ్రా చేయడం వెలుగులోకి వచ్చింది. ఎన్నికల కమిషన్‌ ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘సర్‌’ ప్రక్రియలో అధికారులు, బీఎల్‌ఓలు అధికార పార్టీకి అనుకూలంగా పనిచేస్తున్నా, పక్కాగా ఆధారాలు బయటపడినా కనీస చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలు ఉన్నాయి.

భూ సర్వే వివాదాలు.. చుక్కల సమస్యలు

జిల్లాలో ఈ ప్రభుత్వం వచ్చాక చేపట్టిన భూముల రీసర్వేతో భూ వివాదాలు పెరిగాయి. రెవెన్యూ రికార్డుల్లో చుక్కల సమస్య పరిష్కారానికి గత ప్రభుత్వం చర్యలు తీసుకుంటే.. కూటమి ప్రభుత్వం వచ్చి యథాస్థితికి తెచ్చిపెట్టింది. ప్రతి సోమవారం కలెక్టరేట్‌లో జరిగే ప్రజాసమస్యల పరిష్కార వేదికలో వచ్చే అర్జీల్లో 70– 80 శాతం భూ సర్వే వివాదాలు.. చుక్కల సమస్యలపైనే ఉంటున్నాయి. ఇక జిల్లా వ్యాప్తంగా టీడీపీ నేతల భూ ఆక్రమణలు పెరిగినా.. కనీస చర్యలు తీసుకునే సాహసం రెవెన్యూ యంత్రాంగం చేపట్టలేకపోతోంది. రూ.కోట్ల విలువైన ప్రభుత్వ భూములు కబ్జాదారుల కబంధహస్తాల్లోకి వెళ్తున్నాయి.

జిల్లాలో పాలనా వ్యవస్థలో గాడి తప్పిన ప్రభుత్వ వ్యవస్థలను దారిలో పెట్టాల్సిన విజిలెన్స్‌, ఏసీబీ శాఖలు చేవ కోల్పోయాయి. అధికార పార్టీ నేతల గుప్పెట్లో తోలుబొమ్మల్లా ఆడుతున్నారనే ఆరోపణలు లేకపోలేదు. గత ప్రభుత్వంలో పారదర్శకంగా జరిగిన పనులపై కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక స్థానిక ఎమ్మెల్యేలు ఆరోపణలు చేస్తూ విజిలెన్స్‌ విచారణకు సిఫార్సుకు చేశారు. దాదాపు 90కిపైగా విచారణలు విజిలెన్స్‌ ముందుకు వచ్చా యి. వీటిల్లో కొన్నింటి విషయాల్లో అడ్డగోలుగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు లేకపోలేదు. వెంకటాచలంలోని జగనన్న లేఅవుట్‌ విషయంలో విజిలెన్స్‌ అధికారులు ‘దున్నపోతు ఈనిందనే’ చందంగా వ్యవహరిస్తున్నారు. పలు విషయాల్లో వైఎస్సార్‌సీపీ మాజీప్రజాప్రతినిధులపై తప్పుడు కేసులు కట్టి.. వేధింపులకు దిగడం తప్పించి.. వాటిల్లో తప్పులను బట్టబయలు చేయలేకపోవడం గమనార్హం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement